భారత్‌కు మరో ఎస్‌-400.. ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చుక్కలు చూపించింది ఇదే..!

Another S400 Missile Defense System will arrive in May
  • మేలో భారత్‌కు చేరుకోనున్న మరో ఎస్-400
  • ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చెమలు పట్టించిన డిఫెన్స్‌ సిస్టమ్‌
  • వీటి రాకతో పాక్‌ సరిహద్దులో పటిష్ఠ భద్రత
  • స్వదేశీ పరిజ్ఞానంతోనూ సిద్ధమవుతున్న క్షిపణి వ్యవస్థలు
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్థాన్ సరిహద్దుల్లో అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను నిర్మిస్తోంది. రష్యా నుంచి మే నెలలో మరో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ భారత్‌కు చేరుకోనుంది. దీన్ని రాజస్థాన్, పంజాబ్ సెక్టార్లలో మోహరించనున్నారు. ఈ ప్రాంతాలకు డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఎస్-400 స్క్వాడ్రన్ ఆ ముప్పును అడ్డుకుని సరిహద్దుల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేస్తుంది.

600 కిలోమీటర్ల నిఘా.. 300 లక్ష్యాలు
ఎస్-400 వ్యవస్థలోని శక్తిమంతమైన రాడార్ (91ఎన్6ఈ) ఒకేసారి 300 లక్ష్యాలను గుర్తించగలదు. ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు కదలికలను పసిగట్టగలదు. దీనివల్ల సరిహద్దుకు అవతల ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను కూడా భారత్ తన భూభాగం నుంచే గమనించవచ్చు. శత్రువులు క్షిపణిని ప్రయోగించే లోపే ఎస్-400 దాన్ని లాక్ చేసి, భారత్ అప్రమత్తం అయ్యేలా చేస్తుంది.

బహుళ అంచెల రక్షణ కవచం
భారత్ కేవలం ఒక్క ఎస్-400 మీదనే ఆధారపడకుండా మూడు రకాల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. సుదూర లక్ష్యాల కోసం (400 కి.మీ) ఎస్-400 ట్రయంఫ్‌ సిస్టమ్‌ను సిద్ధం చేసింది. మధ్య శ్రేణి లక్ష్యాల కోసం (150-350 కి.మీ) స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'ప్రాజెక్ట్ కుశ'ను వాడుకోనుంది. దగ్గరి లక్ష్యాల కోసం ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన ఎంఆర్-ఎస్ఏఎం, భారత్ తయారు చేసిన సమర్ (ఎస్ఏఎంఏఆర్), ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఉపయోగపడున్నాయి.

'ఆపరేషన్ సిందూర్' అనుభవం
మే 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 యుద్ధ సామర్థ్యం ఏంటో యావత్‌ ప్రపంచం చూసింది. ఆ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులను ఇది విజయవంతంగా అడ్డుకుంది. ఆ అనుభవంతో భారత వైమానిక దళం ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ సాఫ్ట్‌వేర్‌ను డ్రోన్ దాడులను కూడా తట్టుకునేలా మరింత ఆధునికీకరిస్తోంది.

పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ
అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా-భారత్ రక్షణ ఒప్పందం ప్రకారం ఈ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. 2026 నాటికి ఐదు స్క్వాడ్రన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హిమాలయాల నుంచి కచ్ వరకు భారత్ చుట్టూ ఒక బలమైన రక్షణ కవచం ఏర్పడుతుంది.


Go Back to Shorts
S-400
Missile Defense System
India
Russia
Operation Sindoor

More Telugu News