ఒకసారి చేతులు కలిపితే పూర్తి బాధ్యత మాదే: మంత్రి నారా లోకేష్

Nara Lokesh gives full assurance to entrepreneurs
  • విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్
  • దేశ డిజిటల్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయం అన్న మంత్రి లోకేష్
  • 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ హబ్.. 2 లక్షల ఉద్యోగాల అంచనా
  • 2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం
  • పదేళ్లలోనే విశాఖలో హైదరాబాద్ స్థాయి అభివృద్ధి సాధిస్తామని ధీమా
విశాఖపట్నం కేంద్రంగా భారతదేశ డిజిటల్ ప్రగతిలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని, ఇది కేవలం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలకమైన మలుపు అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్‌లో మంగళవారం జరిగిన ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా, విశాఖ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వ దార్శనికతను, లక్ష్యాలను ఆయన స్పష్టంగా వివరించారు.

పెట్టుబడుల విషయంలో ఎంవోయూలపై కాకుండా, షేక్ హ్యాండ్‌లపై నమ్మకం ఉంచుతామని, ఒకసారి చేతులు కలిపితే ఆ ప్రాజెక్టును తమదిగా భావించి పూర్తి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున ఏపీ, విశాఖలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలేతో పాటు 49 కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

"దశాబ్దాలుగా దేశ ఖనిజ సంపదను ప్రపంచానికి అందించిన విశాఖ నగరం.. ఉక్కు పునాదులపై నిర్మితమైంది. కానీ నేడు, ఈ ఉక్కు నగర పునాదులను కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంపై నిర్మించబోతున్నాం. మన దేశ భవిష్యత్తును వైజాగ్ నిర్మించబోతోందని నేను బలంగా విశ్వసిస్తున్నాను" అని లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచం భారీ పరిశ్రమల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాల వైపు, తయారీ నుంచి మెషిన్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా మారుతోందని, ఈ మార్పులో విశాఖ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు

గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు చరిత్రాత్మకమని మంత్రి అభివర్ణించారు. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయిన 15 బిలియన్ డాలర్లతో పాటు, ఒక గిగా వాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఎకోసిస్టమ్ ఇక్కడ రూపుదిద్దుకోనుందని తెలిపారు. తొలిసారిగా విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని, కనెక్టివిటీ విషయంలో ఇతర రాష్ట్రాలతో దీటుగా పోటీ పడతామని చెప్పారు. "ఒకప్పుడు ఓడరేవులు ఈ నగరాన్ని ప్రపంచంతో భౌతికంగా కలిపితే, ఇప్పుడు ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు డిజిటల్‌గా అనుసంధానిస్తాయి. ఈ పెట్టుబడి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఆర్థికాభివృద్ధికి ఒక మల్టిప్లయర్," అని లోకేష్ వివరించారు.

2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖ

2047 నాటికి విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల ఆర్సెలార్ మిట్టల్‌తో కలిసి గ్రీన్ స్టీల్ సిటీకి శంకుస్థాపన చేశామని, అదేవిధంగా ఏఐ, డేటా, ఫార్మా, మెడికల్ డివైసెస్ రంగాల్లో భారీ అభివృద్ధి జరగనుందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, "ఒకప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణానికి చంద్రబాబు గారు సంకల్పించినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. కానీ, స్పష్టమైన విజన్‌తో అది సాధ్యమైంది. హైదరాబాద్‌లో 30 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని, విశాఖలో రాబోయే 10 ఏళ్లలోనే సాధించి చూపిస్తాం," అని ధీమా వ్యక్తం చేశారు.

అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది

ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రమని, అందుకే తమలో అభివృద్ధి పట్ల కసి, పట్టుదల ఎక్కువగా ఉన్నాయని మంత్రి అన్నారు. "చరిత్రలో నాలుగుసార్లు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం మాకు పడింది. మొదట మద్రాసులో, తర్వాత కర్నూలు రాజధానిగా, ఆ తర్వాత హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుని విడిపోయాం. ఈ అనుభవమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. మమ్మల్ని ఒక స్టార్టప్‌లా చూడండి" అని పారిశ్రామికవేత్తలను కోరారు. మా కేబినెట్‌లో 25 మంది మంత్రుల్లో 17 మంది, శాసనసభ్యుల్లో సగం మంది కొత్తవారేనని, అందరం ఉత్సాహంతో పనిచేస్తున్నామని చెప్పారు.


Go Back to Shorts
Nara Lokesh
Google AI Shakti Conclave
Vizag
TDP
Andhra Pradesh

More Telugu News