చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం: రేవంత్ రెడ్డి

  • హైటెక్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రావడం అంటే సాక్షాత్తు హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్టే అన్న సీఎం
  • నెట్‌ఫ్లిక్స్‌కు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ

హైదరాబాద్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా మార్చే దిశగా మరో భారీ అడుగు పడింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన 'ఐలైన్ స్టూడియోస్' గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను హైటెక్ సిటీలో ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రావడం అంటే సాక్షాత్తు హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే అని అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పనిచేయాలనే తన కల నేడు నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ఇది ఇండియాలో రెండో కార్యాలయం అని చెప్పారు. ఫోర్త్ సిటీగా పిలుస్తున్న 'ఫ్యూచర్ సిటీ'లో నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... ఈ సంస్థకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని, ఇక్కడ పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు.


తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. తన చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, వీసీఆర్‌ల నుంచి నేడు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కల్కి' వంటి అంతర్జాతీయ స్థాయి సినిమాల వరకు వచ్చిన మార్పులను సీఎం గుర్తుచేసుకున్నారు. చెన్నై నుంచి టాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తెచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, హీరో రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.



More Telugu News