ఫైనల్లో నా ఫామ్‌కు కారణం అత‌ని బ్యాటే.. అసలు విషయం చెప్పిన అభిషేక్ శర్మ

  • ఫైనల్లో శివమ్ దూబే బ్యాట్‌తో అదరగొట్టాన‌న్న‌ అభిషేక్ శర్మ
  • టోర్నీలో ఫామ్ లేక ఇబ్బంది పడ్డానని వెల్లడి
  • కష్టకాలంలో జట్టు సభ్యులు తనకు అండగా నిలిచారని వ్యాఖ్య
  • ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ వల్లే రాణించానన్న యంగ్ ఓపెనర్
2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హీరోగా నిలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి భారత్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, తన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సహచర ఆటగాడు శివమ్ దూబే బ్యాటే కారణమని, మ్యాచ్ అనంతరం ప్రెస్‌మీట్‌లో తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా అభిషేక్ శర్మ మాట్లాడుతూ... "ఈ ఇన్నింగ్స్‌కు క్రెడిట్ శివమ్ దూబేకి దక్కుతుంది. నేను అతని బ్యాట్‌తో ఆడాను. అందుకు అతనికి ధన్యవాదాలు. ఉదయం ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించింది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో నేను దూబే దగ్గరకు వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నాను" అని తెలిపాడు.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ టోర్నీలో అభిషేక్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన విష‌యం తెలిసిందే. కడుపు ఇన్ఫెక్షన్ బారిన పడటంతో పాటు ఫైనల్‌కు ముందు ఆడిన మ్యాచ్‌లలో కలిపి కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, అత్యంత కీలకమైన ఫైనల్లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.

గత నెల రోజులుగా తాను ఎదుర్కొన్న కష్టకాలం గురించి అభిషేక్ వివరించాడు. "గత ఏడాదిన్నరగా అద్భుతంగా రాణించాక, గత నెల రోజులుగా నేను ఈ క్లిష్ట దశతో పోరాడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరితో ఉంటామనేది చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని మెరుగ్గా మార్చాలని కోరుకుంటే అది పెద్ద మార్పు తెస్తుంది. నేను బ్యాట్‌తో రాణించనప్పుడు కూడా జట్టులోని ప్రతి ఒక్కరూ నాపై నమ్మకం ఉంచారు. 'అతను కచ్చితంగా రాణిస్తాడు' అని చెబుతూనే ఉన్నారు. నా సహచరులను, కోచ్‌లను, సహాయక సిబ్బందిని నేను ఎప్పుడూ సందేహించలేదు" అని అన్నాడు.

ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనల్ని మనం నమ్మడం మొదటి అడుగు అని అభిషేక్ పేర్కొన్నాడు. "మనపై మనకు సందేహం మొదలైతే ఒత్తిడి పెరిగి, సహజమైన ఆట ఆడలేం. ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ, ఇతరులకు సహాయం చేయడం చాలా ముఖ్యం. మనం ఇతరులకు సహాయం చేస్తే అది ఏదో ఒక రూపంలో మనకే తిరిగి వస్తుంది" అని తెలిపాడు. జట్టు సభ్యులు అందించిన ఈ అద్భుత‌మైన మద్దతే తనను తిరిగి ఫామ్‌లోకి తెచ్చిందని అభిషేక్ స్పష్టం చేశాడు.


More Telugu News