విజయ్‌కు మరో షాక్.. ఇంటి కోసం కోర్టుకెక్కిన భార్య సంగీత

  • విడాకుల వివాదంలో విజయ్‌పై కొత్త పిటిషన్ వేసిన భార్య సంగీత
  • విడాకులు పూర్తయ్యే వరకు చెన్నై నివాసంలోనే ఉండేందుకు అనుమతి కోరిన సంగీత
  • మరో నటితో విజయ్‌కు వివాహేత‌ర‌ సంబంధం ఉందని పిటిషన్‌లో ఆరోపణ
  • విజయ్‌కు నోటీసులు జారీ చేసిన చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు
ప్రముఖ తమిళ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు మరింత పెరిగాయి. ఆయన భార్య సంగీత, తమ విడాకుల వివాదంలో భాగంగా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక కీలకమైన పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల ప్రక్రియ ముగిసేంత వరకు చెన్నై నీలంకరైలోని తమ ఇంట్లోనే నివసించడానికి అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

విడాకుల ప్రక్రియతో ముందుకు వెళితే ఇంటిని ఖాళీ చేయాలని విజయ్ తరపు న్యాయవాదులు తనను హెచ్చరించారని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నందున, చెన్నైలో తనకు వేరే నివాసం లేదని ఆమె తెలిపారు. తన పిల్లలతో కలిసి విజయ్ హోదాకు తగినట్లుగా ఆ ఇంట్లో నివసించే హక్కు తనకు ఉందని ఆమె వాదించారు.

ఈ వివాదానికి ఓ ప్రముఖ నటితో విజయ్‌కు ఉన్న వివాహేత‌ర‌ సంబంధమే కారణమని, దీనివల్ల 2021 నుంచి తాను తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నానని సంగీత ఆరోపించారు. విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా ఆమె భారీ మొత్తంలో భరణం కూడా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, సీఎం అభ్యర్థిగా సిద్ధమవుతున్న తరుణంలో ఈ వివాదం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. సంగీత పిటిషన్‌పై స్పందించిన కోర్టు, విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.


More Telugu News