గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు భారీ వేతనం.. ప్రపంచంలోనే అత్యధిక జీతం!

  • గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు భారీ వేతన ప్యాకేజీ ప్రకటన
  • రాబోయే మూడేళ్లలో రూ. 6,361 కోట్లు ఆర్జించే అవకాశం
  • కంపెనీ పనితీరు ఆధారంగా రెట్టింపు కానున్న స్టాక్ యూనిట్లు
  • వేమో, వింగ్ వంటి అటానమస్ వెంచర్ల వృద్ధికి ప్రోత్సాహకాలు
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి గాను ఏకంగా 692 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ. 6,361 కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఈ ప్యాకేజీ ఆయన పనితీరు, కంపెనీ వృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉండటం విశేషం.

ఈ భారీ ప్యాకేజీలో ఎక్కువ భాగం పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ల రూపంలో ఉంది. దీని విలువ 126 మిలియ‌న్ డాల‌ర్లు. ఎస్&పీ 100 సూచీలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్ షేర్ హోల్డర్లకు లభించే రాబడి ఆధారంగా ఈ ప్యాకేజీ విలువ మారుతుంది. కంపెనీ పనితీరు లక్ష్యాలను అధిగమిస్తే, ఈ విలువ రెట్టింపు అయి 252 మిలియన్ డాల‌ర్ల‌కు చేరవచ్చు. ఒకవేళ లక్ష్యాలను అందుకోకపోతే దీని విలువ సున్నా కూడా కావొచ్చు. దీనికి అదనంగా సుందర్ పిచాయ్‌కు మూడేళ్ల కాలానికి 84 మిలియన్ డాల‌ర్ల‌ విలువైన రిస్ట్రిక్టెడ్ స్టాక్, వార్షిక వేతనంగా 2 మిలియన్లు అందనున్నాయి.

కంపెనీలోని అటానమస్ (స్వయంప్రతిపత్త) వెంచర్లైన వేమో, వింగ్ ఏవియేషన్ వృద్ధికి ఊతమిచ్చేలా ఆల్ఫాబెట్ కొత్తగా 350 మిలియన్ డాల‌ర్ల‌ విలువైన స్టాక్ ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పిచాయ్‌కు వేమోలో 130 మిలియన్ డాల‌ర్ల‌ విలువైన స్టాక్, వింగ్ ఏవియేషన్‌లో 45 మిలియన్ డాల‌ర్ల‌ షేర్లు లభిస్తాయి. ఈ వెంచర్ల పనితీరు అద్భుతంగా ఉంటే ఈ స్టాక్స్ విలువ 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. డ్రైవర్‌లెస్ కార్లు, డెలివరీ డ్రోన్స్ వంటి క్లిష్టమైన రంగాలలో సుందర్ పిచాయ్ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆల్ఫాబెట్ బోర్డు ఈ సందర్భంగా పేర్కొంది.

2015 ఆగస్టులో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుందర్ పిచాయ్, గూగుల్ మార్కెట్ విలువను దాదాపు ఏడు రెట్లు పెంచారు. అప్పట్లో 535 బిలియన్ డాల‌ర్లుగా ఉన్న మార్కెట్ క్యాప్, ఇప్పుడు 3.6 ట్రిలియన్ డాల‌ర్ల‌కు చేరింది. 53 ఏళ్ల పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరి క్రోమ్, ఆండ్రాయిడ్ వంటి కీలక విభాగాలను విజయవంతంగా నడిపి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (96.5 మిలియన్ డాల‌ర్లు), యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (74.3 మిలియన్ డాల‌ర్లు) వంటి వారి వార్షిక వేతనాలతో పోలిస్తే పిచాయ్ ప్యాకేజీ చాలా అధికం కావడం గమనార్హం.


More Telugu News