ఇరాన్ అధినేత హత్యతో పాక్‌లో కల్లోలం.. ఆర్థిక సంక్షోభంపై తీవ్ర ఆందోళన

  • ఇరాన్ అధినేత ఖ‌మేనీ హత్యపై ఆందోళన
  • పాకిస్థాన్‌లో నిరసనలు హింసాత్మకం.. 25 మంది మృతి
  • తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణుల హెచ్చరిక
  • అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించారన్న పాక్ ప్రధాని
  • ఇంధన ధరలు పెరిగి, రెమిటెన్స్‌లు తగ్గే ప్రమాదం
ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖ‌మేనీ హత్యతో పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన, అశాంతి నెలకొంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మరణించడం పాకిస్థాన్‌పై, ముఖ్యంగా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా డైలీ డాట్ కామ్ తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామంతో పాకిస్థాన్‌లో తీవ్ర శోకం, ఆందోళన నెలకొందని ఆ దేశ మాజీ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ అన్నారు.

ఖ‌మేనీ హత్యకు నిరసనగా పాకిస్థాన్ వ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనలు చెలరేగాయి. గత కొన్ని రోజులుగా ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో కనీసం 25 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. దేశంలోని అతిపెద్ద నగరమైన కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పైకి నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. లాహోర్‌లోనూ ఇలాంటి దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.

ఈ ఘటనపై పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖ‌మేనీ మృతి పట్ల ఇరాన్ ప్రజలకు సంతాపం తెలిపారు. "అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశాధినేతలను లక్ష్యంగా చేసుకోకూడదనేది పురాతన సంప్రదాయం" అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే పాక్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేస్తే ఇంధన ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతాయని, ప్రజల జీవనం కష్టతరమవుతుందని పాకిస్థాన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఖలీద్ తైమూర్ అక్రమ్ తెలిపారు. పశ్చిమాసియాలో పనిచేస్తున్న పాకిస్థానీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా దేశానికి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘర్షణ ముదిరితే ప్రపంచం మొత్తం నష్టపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News