ఏఐ సృష్టించిన నకిలీ తీర్పులు... ట్రయల్ కోర్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • ఏఐ సృష్టించిన నకిలీ తీర్పులను ప్రామాణికంగా తీసుకున్న ట్రయల్ కోర్టు
  • ఇది కేవలం పొరపాటు కాదు మిస్‌కాండక్ట్ అని సుప్రీం వ్యాఖ్య
  • ఏపీ హైకోర్టు పరిధిలోని ఆస్తి తగాదా కేసులో వెలుగు చూసిన ఘటన
  • అటార్నీ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ
  • తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా
ఉనికిలో లేని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టించిన నకిలీ తీర్పులను ప్రామాణికంగా తీసుకుని ఒక సివిల్ కేసులో ట్రయల్ కోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం నిర్ణయం తీసుకోవడంలో జరిగిన పొరపాటు కాదని, న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థ విశ్వసనీయతకే భంగం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోని ఓ ఆస్తి తగాదా కేసులో ఈ విషయం వెలుగుచూసింది. అడ్వకేట్ కమిషనర్ నివేదికపై ప్రతివాదుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ట్రయల్ కోర్టు కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించింది. అయితే, ఆ తీర్పులు అసలు లేనే లేవని, అవి ఏఐ సృష్టించిన నకిలీవని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఏపీ హైకోర్టు కూడా అవి నకిలీ తీర్పులేనని గుర్తించి హెచ్చరించినప్పటికీ, కేసు మెరిట్స్ ఆధారంగా పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం.. ఏఐ సృష్టించిన నకిలీ తీర్పుల ఆధారంగా న్యాయస్థానాలు నడుచుకోవడం సంస్థాగతంగా ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. దీనికి చట్టపరమైన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. కోర్టుకు సహాయం చేసేందుకు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేస్తూ, అప్పటివరకు అడ్వకేట్ కమిషనర్ నివేదిక ఆధారంగా ముందుకెళ్లవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది.


More Telugu News