Sivaji: 'దండోరా' సినిమా ఫెయిల్ కావడానికి కారణం ఇదే: శివాజీ

Sivaji Reveals Reason for Dandora Movie Failure
  • విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'దండోరా'
  • బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిన వైనం
  • విడుదల సమయం సరిగ్గా లేదన్న శివాజీ

నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన 'దండోరా' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమా వైఫల్యానికి గల కారణాలను శివాజీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విశ్లేషించారు. సినిమా విడుదల సమయం (రిలీజ్ డేట్) సరిగ్గా లేకపోవడమే ప్రధాన తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, సెన్సార్ ప్రక్రియలో జాప్యం జరిగిందని.. 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు క్లియరెన్స్ రాకపోవడంతో థియేటర్ల యజమానులు రిస్క్ తీసుకోలేకపోయారని ఆయన వెల్లడించారు. సెన్సార్ అవుతుందో లేదో అన్న అనిశ్చితి వల్ల ఎవరూ థియేటర్లు ఇవ్వడానికి ముందుకు రాలేదని, అది సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.


కేవలం విడుదల సమయమే కాకుండా, సినిమా టైటిల్ కూడా మైనస్ అయిందని శివాజీ పేర్కొన్నారు. 'దండోరా' అనే పేరు వినగానే ఇది ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్న సినిమా అని ప్రేక్షకులు భావించారని చెప్పారు. అందుకే, ఆ టైటిల్ మార్చాలని తాను నెల రోజుల పాటు ప్రయత్నించానని, కానీ కుదరలేదని చెప్పారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా సినిమాకు సరైన ప్రైమ్ టైమ్ షోలు దక్కలేదని.. కేవలం సాయంత్రం 4 గంటలకు, రాత్రి 10 గంటలకు మాత్రమే షోలు ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ, ఉన్న తక్కువ స్క్రీన్లతోనే నైజాం ఏరియాలో కోటి రూపాయల కలెక్షన్లను రాబట్టడం విశేషమని, ఒకవేళ సరైన థియేటర్లు మరియు షోలు లభించి ఉంటే సినిమా భారీ విజయాన్ని నమోదు చేసేదని శివాజీ స్పష్టం చేశారు. కంటెంట్ పరంగా మెప్పించినా... సాంకేతిక, పంపిణీ పరంగా జరిగిన లోపాల వల్లే 'దండోరా' వెనుకబడిందని ఆయన వివరించారు.

Sivaji
Dandora Movie
Dandora Film
Telugu Movies
Box Office Failure
Movie Release Date
Telugu Cinema
Movie Title
Nizam Collections

More Telugu News