Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 50 గ్రామాలు ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరిక

Israel warns 50 Lebanon villages to evacuate amid attacks
  • మధ్యప్రాచ్యంలో తారస్థాయికి చేరిన యుద్ధ వాతావరణం
  • హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు
  • ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో కొనసాగుతున్న సైనిక చర్య
  • బీరుట్‌ నగరంపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత తీవ్ర రూపం దాల్చిన ఘర్షణలు.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర దాడులకు దారితీశాయి. ఈ క్రమంలో, లెబనాన్‌లోని సుమారు 50 గ్రామాల ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం (IDF) సోమవారం హెచ్చరిక జారీ చేసింది.

హిజ్బుల్లా ఉగ్రవాదులు తమ సైనిక కార్యకలాపాలను జనావాసాల నుంచే నిర్వహిస్తున్నారని, ఈ కారణంగా సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. గ్రామాలకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచించింది.

ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. 2024 యుద్ధం తర్వాత బీరుట్ నగరం ఈ స్థాయిలో కంపించిపోవడం ఇదే మొదటిసారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఈ దాడులను చేపట్టింది.

ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా గ్రూపు.. ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడటంతో ఇజ్రాయెల్ ఈ తీవ్ర ప్రతిచర్యకు దిగింది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Israel
Lebanon
Hezbollah
IDF
Middle East conflict
Operation Roaring Lion
Beirut
Israel-Lebanon border
Iran
Military operations

More Telugu News