Iran: ఇరాన్ యుద్ధంతో ఇండియాకు కష్టాలు

Iran War Impact on Indias Trade and Economy
  • ఇరాన్‌ కు వెళ్తున్న భారీ షిప్‌మెంట్లపై అనిశ్చితి
  • నిలిచిన బాస్మతి రైస్ ఎగుమతులు
  • ముడి చమురు దిగుమతులకు ‘హార్ముజ్ జలసంధి’ గండం..50% సరఫరా నిలిచిపోయే ప్రమాదం


పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతలు ప్రధానంగా రెండు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి: ఒకటి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేలా చేస్తున్న ముడి చమురు, రెండోది భారత రైతుల ఆదాయానికి మూలమైన బాస్మతి బియ్యం ఎగుమతులు.

బాస్మతి బియ్యం ఎగుమతులు..

భారతదేశం నుంచి ఎగుమతయ్యే బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద కొనుగోలుదారు. యుద్ధం ప్రారంభం కావడానికి రెండు నెలల ముందే ఇరాన్ వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో భారత మార్కెట్లో బాస్మతి బియ్యం ధర కిలోకు రూ.10 పెరిగింది. అయితే, ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారత్ ఎగుమతి చేసే మొత్తం బాస్మతి రైస్ లో 25% ఇరాన్‌కు, 20% ఇరాక్‌కు వెళ్తాయి. సుమారు $2 బిలియన్ల (రూ. 16,000 కోట్లకు పైగా) విలువైన 20 లక్షల టన్నుల బియ్యం వ్యాపారం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రస్తుతం సముద్ర మార్గంలో ఉన్న షిప్‌మెంట్ల డెలివరీ తీసుకోవడానికి ఇరాన్ వ్యాపారులు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

చమురు దిగుమతులకు ముప్పు..

భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 40 దేశాలపై ఆధారపడుతున్నప్పటికీ 50% దిగుమతులు పశ్చిమ ఆసియా నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి వచ్చే చమురు ‘హోర్ముజ్ జలసంధి’ గుండానే రావాలి. ప్రపంచ చమురు సరఫరాలోనూ 25% ఈ మార్గం నుంచే జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ జలసంధి మూతపడితే భారత్‌కు రోజుకు వచ్చే 25-27 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోతుంది. గల్ఫ్ నుంచి అయితే కేవలం 5-7 రోజుల్లో చమురు వస్తుంది. అదే అమెరికా, లాటిన్ అమెరికా నుంచి చమురు తెప్పించుకోవాలంటే 25 నుంచి 45 రోజులు పడుతుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి దేశంలో ఇంధన ధరలు భగ్గుమనే అవకాశం ఉంది.

తేయాకు ఎగుమతులపై ప్రభావం..

బియ్యంతో పాటు టీ (తేయాకు) ఎగుమతులపై కూడా ప్రభావం పడనుంది. 2024-25 ఏడాదిలో భారత్ దాదాపు రూ. 700 కోట్ల విలువైన తేయాకును ఇరాన్‌కు ఎగుమతి చేసింది. ప్రస్తుత అనిశ్చితి వల్ల ఈ చెల్లింపులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి పశ్చిమ ఆసియాలో యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుంది.

Iran
Iran war impact on India
Basmati rice exports
Crude oil imports
India Iran trade relations
India Middle East relations
Tea exports India
Oil prices India
Economic impact of war
India economy

More Telugu News