Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్, సిసోడియాల డిశ్చార్జ్‌పై హైకోర్టులో సీబీఐ పిటిషన్

Arvind Kejriwal CBI Petition Filed in High Court Over Discharge in Liquor Case
  • తగిన ఆధారాల్లేవని కేసు కొట్టివేసిన ట్రయల్ కోర్టు
  • కేజ్రీవాల్ సహా 23 మందిని నిర్దోషులుగా వదిలేయడాన్ని సవాల్ చేసిన సీబీఐ
  • రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు
  • విచారణలో కీలక అంశాలను కోర్టు విస్మరించిందని సీబీఐ వాదన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ (2022) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మంది నిందితులను రౌస్ అవెన్యూ కోర్టు డిశ్చార్జ్ (విచారణ అవసరం లేదని వదిలేయడం) చేయడాన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

నిందితులపై అభియోగాలు మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు కూడా లేవని, ప్రాసిక్యూషన్ సరైన కేసును రుజువు చేయలేకపోయిందని పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. 

అంతకుముందు స్పెషల్ జడ్జి (పీసీ యాక్ట్) జితేంద్ర సింగ్ సుమారు 1,100 పేరాల సుదీర్ఘ తీర్పును వెలువరించారు. సీబీఐ చేసిన ఆరోపణలు న్యాయపరమైన పరిశీలనకు నిలబడవని, ఈ కేసు పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దాదాపు 300 మంది సాక్షుల వాంగ్మూలాలను, భారీ రికార్డులను పరిశీలించినా.. నిందితులపై కనీస అనుమానం కలిగించే అంశాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా నిందితులను సుదీర్ఘ విచారణకు గురిచేయడం అన్యాయమని, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.

అయితే, దర్యాప్తులో తాము సేకరించిన అనేక కీలక అంశాలను ట్రయల్ కోర్టు సరిగా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ వాదిస్తోంది. మద్యం పాలసీని కొందరికి అనుకూలంగా రూపొందించారని, 'సౌత్ గ్రూప్' వంటి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చి ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ అంశాలను పునఃసమీక్షించాలని హైకోర్టును కోరింది. మరోవైపు, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తప్పుడు, కల్పిత కేసు అని కొట్టిపారేస్తూ.. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, 'సత్యమేవ జయతే' అని వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal
Delhi liquor case
Manish Sisodia
CBI
Delhi High Court
liquor policy scam
Rouse Avenue Court
AAP
corruption
excise policy

More Telugu News