Etela Rajender: హైడ్రా పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు: ఈటల రాజేందర్ ఆగ్రహం

Etela Rajender Angered by Harassment in Hydra Name
  • రేవంత్ రెడ్డి ఆగడాలకు రాహుల్ గాంధీ అడ్డుకట్ట వేయాలన్న ఈటల రాజేందర్
  • మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • మధు రిట్జ్ అపార్టుమెంట్ వాసులకు అండగా నిలబడతామని హామీ
హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కానీ పెద్దల జోలికి వెళ్లడం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగడాలకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూసీ పునరుజ్జీవనం పేరుతో నిరుపేదలు, సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మధు రిట్జ్ అపార్టుమెంట్ వాసులకు తాము అండగా నిలబడతామని ఈటల హామీ ఇచ్చారు.

అధికారంలో ఉన్నందుకు పేదలకు మంచి జరిగే పనులు చేయాలి తప్ప వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని హితవు పలికారు. ప్రభుత్వం మూడు నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు క్లియర్ చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయని వాపోయారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు ఈ వయస్సులో సచివాలయం చుట్టు చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలతోనే ఖమ్మంలో ఇళ్లను కూల్చివేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారని, న్యాయస్థానాలు కూడా పేదల జీవితాలను దృష్టిలో ఉంచుకుని తీర్పులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు 40 నుంచి 50 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారని, అలాంటి ఇళ్లను నేలపట్టం చేశారని మండిపడ్డారు.
Etela Rajender
Telangana
Revanth Reddy
Rahul Gandhi
BJP
Moosi River
Hyderabad
Fee Reimbursement

More Telugu News