Dharmana Prasada Rao: ‘డయేరియా’ మరణాలపై ధర్మాన ప్రసాదరావు ఫైర్

Dharmana Prasada Rao Fires Over Diarrhea Deaths in Srikakulam
  • కూటమి పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్న ధర్మాన
  • స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో లేదని విమర్శ
  • ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్య

శ్రీకాకుళం జిల్లాలో ప్రబలిన డయేరియా బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత 20 నెలల కూటమి పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయని మండిపడ్డారు.


అతిసార వ్యాధితో జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోతే, ప్రభుత్వం మాత్రం కేవలం ఒకరు లేదా ఇద్దరే చనిపోయారని అబద్ధపు లెక్కలు చెబుతోందని ధర్మాన ఆరోపించారు. "వాంతులు, విరోచనాలతో ప్రజలు అల్లాడుతుంటే, సహాయం చేయాల్సింది పోయి పోస్టుమార్టం నివేదికలంటూ కాలయాపన చేస్తున్నారు. గత డిసెంబర్‌లోనూ బలగ ప్రాంతంలో ఇలాగే డయేరియా విజృంభించినా ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు. ప్రస్తుతం 100 మందికి పైగా రోగులు ఆసుపత్రుల పాలయ్యారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకోవడంపై ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లేదు" అని ధ్వజమెత్తారు.


ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందించాలనే గత ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రైవేటీకరణ పేరుతో తుంగలో తొక్కారని ధర్మాన విమర్శించారు. రాజధాని పేరుతో డబ్బునంతా ఒకే చోట కుమ్మరిస్తూ, జిల్లాల అభివృద్ధిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. సాగుకు యూరియా అందక రైతులు, ఇంగ్లీషు మీడియం చదువులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేకపోగా, క్వింటాల్‌కు రెండు కిలోల చొప్పున అదనంగా దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.


శ్రీకాకుళం అభివృద్ధి కోసం కనీసం వెయ్యి కోట్లు అయినా ఖర్చు చేశారా? అని ప్రశ్నించిన ఆయన... ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

Dharmana Prasada Rao
Srikakulam
Diarrhea deaths
Andhra Pradesh
TDP Government
Public health
YSRCP
Dharmana Prasad Rao comments
Srikakulam Diarrhea
AP Politics

More Telugu News