Mudragada Padmanabham: అంబటి ఇంటికి ముద్రగడ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు

Mudragada Padmanabham Criticizes Chandrababu Over Ambati Rambabu Attack
  • మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లిన ముద్రగడ పద్మనాభం
  • వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపణ
  • కాపుల సాయంతో గెలిచి వారినే వేధిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు
  • అంబటి కుమార్తె మౌనిక ఫైర్‌బ్రాండ్ అని ప్రశంస
  • ఇళ్లపై దాడుల సంస్కృతికి స్వస్తి పలకాలని ప్రభుత్వానికి హెచ్చరిక
వైసీపీ సీనియర్ నేత, కాపు ఉద్యమ ప్రముఖుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల గుంటూరులో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సోమవారం సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. కూటమి పాలనలో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అంబటి ఇంటిపై దాడి బాధాకరమని, ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి మంచిది కాదని హితవు పలికారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితుడైన అంబటినే జైల్లో పెడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ పర్యటనలో అంబటి కుమార్తె మౌనికను ప్రత్యేకంగా అభినందించిన ముద్రగడ, ఆమెను 'ఫైర్‌బ్రాండ్' అని అభివర్ణించారు. భవిష్యత్తులో ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం చంద్రబాబుపై ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కాపుల ఓట్లతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మళ్లీ కాపులనే వేధిస్తున్నారు. నాడు నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు, ఇప్పుడు అంబటిని టార్గెట్ చేశారు. మాకు జరిగిన అవమానాలు మీ కుటుంబ సభ్యులైన భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి" అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. కాపులు బానిసలు కాదని, తమను అవమానించడం ఆపాలని స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలోనూ కూటమి ప్రభుత్వం రోజూ అబద్ధాలు ఆడుతోందని ముద్రగడ విమర్శించారు. "ఇకనైనా అబద్ధాలు ఆపి శ్రీవారికి క్షమాపణ చెప్పండి లేదా కనీసం లడ్డూ గురించి మాట్లాడటం మానేయండి" అని సూచించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కక్ష సాధింపు చర్యలు, ఇళ్లపై దాడులకు స్వస్తి పలకాలని ప్రభుత్వానికి హితవు పలికారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముద్రగడ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకున్నట్లయింది.


Mudragada Padmanabham
Ambati Rambabu
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
Kapu Community
Guntur Attack
TDP Government
Tirumala Laddu
Mamat Banerjee

More Telugu News