ఎన్నికలకు ముందు మహిళలకు సీఎం స్టాలిన్ 'ముందస్తు' కానుక
- మహిళలకు ముందస్తు మూడు నెలల ప్యాకేజీని విడుదల చేసిన స్టాలిన్ ప్రభుత్వం
- 1.31 కోట్ల మంది మహిళలకు లబ్ధి
- ఈ ఏడాది ప్రథమార్థంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార డీఎంకే ప్రభుత్వం మహిళలకు మరో ఆకర్షణీయ కానుక అందించింది. ‘కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం’ కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు ముందస్తు మూడు నెలల ప్యాకేజీని విడుదల చేసింది. ముందస్తు రూ.3,000తో పాటు వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.2,000... మొత్తం రూ.5,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియాలో ఈ వివరాలు వెల్లడించారు.
ఎన్నికల సాకుతో ఈ సాయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ విపక్షాలపై మండిపడ్డారు. ఈ కారణంగానే, ముందస్తుగా నిధులు విడుదల చేశామని తెలిపారు. మళ్లీ గెలిస్తే ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ రూ.1,000 సాయాన్ని రూ.2,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్లను రూ.1,200 నుంచి రూ.2,000కు పెంచుతామని తెలిపారు.
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. 2021లో డీఎంకే 133 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.