Nara Lokesh: ఆత్మీయ కలయిక - ఇల్లే వేదిక!... స‌రికొత్త సంప్ర‌దాయం ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Starts New Tradition Dinner Meetings with Legislators
  • మంత్రి లోకేశ్ వినూత్న కార్యక్రమం.. ఎమ్మెల్యేలతో డిన్నర్ భేటీలు
  • కుటుంబసమేతంగా ప్రజాప్రతినిధులకు తన నివాసంలో విందు
  • మచిలీపట్నం పార్లమెంట్ నేతలతో తొలి సమావేశం
  • సమస్యలపై చర్చ, వినతులపై నివేదిక అందజేత
  • మహిళలకు మంగళగిరి పట్టుచీరలు బహూకరించిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, వారి నియోజకవర్గ సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు 'ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక' పేరుతో డిన్నర్ సమావేశాలను ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, గురువారం నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తన నివాసానికే ఎమ్మెల్యేలను, వారి కుటుంబ సభ్యులను విందుకు ఆహ్వానిస్తున్నారు.

మొదటి సమావేశం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్ వారితో, వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇది కేవలం విందుకే పరిమితం కాలేదు. నియోజకవర్గాల్లోని సమస్యలపై వారితో చర్చించి, గతంలో వారు ఇచ్చిన వినతుల తాజా పరిస్థితిని నివేదిక రూపంలో అందజేశారు. ఈ ఆత్మీయ కలయికకు వచ్చిన ఆడపడుచులకు లోకేశ్ మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే మార్చి 7వ తేదీ వరకు ఈ డిన్నర్ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఒక జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ కుటుంబాలతో కలిసి ఈ విందులో పాల్గొంటారు.

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. కూటమి ఐక్యత క్షేత్రస్థాయిలోనూ కొనసాగాలని, సభలో అంశాలపై పూర్తి సన్నద్ధతతో ఉండాలని హితవు పలికారు. తాను కూడా సుమారు 40 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి పనితీరును సమీక్షిస్తానని స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh
AP Assembly
Machilipatnam
TDP
Chandrababu Naidu
Dinner Meeting
Political News
Legislators
Budget Session

More Telugu News