చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ పై సీసీఐ కొరడా

  • ఇంటెల్‌పై రూ.27.38 కోట్లు జరిమానా విధించిన సీసీఐ
  • వివక్షాపూరిత వారెంటీ పాలసీని అమలు చేసినందుకు ఈ చర్య
  • భారత్‌లో కొన్న మైక్రోప్రాసెసర్లకే వారెంటీ వర్తించేలా విధానం
  • ఈ పాలసీ వినియోగదారుల ఎంపికను పరిమితం చేసిందని గుర్తింపు
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కార్పొరేషన్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. బాక్స్‌డ్ మైక్రోప్రాసెసర్ల విషయంలో భారత్‌కు మాత్రమే ప్రత్యేకంగా అమలు చేసిన వారెంటీ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో, రూ.27.38 కోట్ల ఫైన్ వేసింది.
మ్యాట్రిక్స్ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు విచారణకు వచ్చింది. 

ఇంటెల్ 2016 ఏప్రిల్ 25 నుంచి భారత్‌లో కొత్త వారెంటీ పాలసీని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఇంటెల్ అధీకృత భారతీయ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేసిన బాక్స్‌డ్ మైక్రోప్రాసెసర్లకు మాత్రమే ఇక్కడ వారెంటీ వర్తిస్తుంది. ఇతర దేశాల్లో కొన్న ప్రాసెసర్లకు భారత్‌లో వారెంటీ లభించదు.

ఈ విధానంపై విచారణ జరిపిన సీసీఐ, డెస్క్‌టాప్‌ల కోసం ఉద్దేశించిన బాక్స్‌డ్ మైక్రోప్రాసెసర్ల మార్కెట్‌లో ఇంటెల్ ఆధిపత్య స్థానంలో ఉందని నిర్ధారించింది. చైనా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లోని వారెంటీ పాలసీలతో పోలిస్తే, భారత్‌లో అమలు చేసిన విధానం వివక్షాపూరితంగా ఉందని అభిప్రాయపడింది. ఇది వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను పరిమితం చేయడంతో పాటు, ప్యారలల్ ఇంపోర్టర్లకు నష్టం కలిగించిందని పేర్కొంది. ఇది కాంపిటీషన్ యాక్ట్, 2002లోని సెక్షన్ 4ను ఉల్లంఘించడమేనని తేల్చింది.

ఈ వివాదాస్పద పాలసీ ఎనిమిదేళ్ల పాటు అమల్లో ఉన్నందున, సంబంధిత టర్నోవర్‌పై 8 శాతం జరిమానా విధించాలని మొదట సీసీఐ భావించింది. అయితే, 2024 ఏప్రిల్ 1 నుంచి ఇంటెల్ ఈ పాలసీని స్వచ్ఛందంగా నిలిపివేయడం వంటి సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుని, జరిమానా మొత్తాన్ని రూ.27.38 కోట్లకు తగ్గించింది. వివాదాస్పద వారెంటీ పాలసీని ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని, దీనిపై నివేదిక సమర్పించాలని ఇంటెల్‌ను సీసీఐ ఆదేశించింది.


More Telugu News