టీ20 వరల్డ్ కప్: అమెరికాపై అతికష్టంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా
- అమెరికా బౌలర్ల ధాటికి టీమిండియా తడబాటు
- ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
- అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న అమెరికా బౌలర్లు
- 4 వికెట్లతో చెలరేగిన పేసర్ వాన్ షాల్క్‌విక్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసిన భారత్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ బౌలర్లు చెలరేగారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరగగా, ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) కాసేపు నిలిచినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ముఖ్యంగా, ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో తిలక్ వర్మ, శివమ్ దూబే (0) వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రింకూ సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) కూడా విఫలమయ్యారు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం క్రీజులో పాతుకుపోయి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 25 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా హర్మీత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. సూర్యకుమార్ వీరోచిత పోరాటంతో భారత్, అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.