Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన

Elon Musk SpaceX China Investments Threaten US Security Senators Worry
  • స్పేస్‌ఎక్స్‌పై సమీక్ష జరపాలని అమెరికా సెనేటర్ల డిమాండ్
  • కంపెనీలో చైనా రహస్యంగా పెట్టుబడులు పెట్టిందని ఆరోపణ
  • ఇది అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని తీవ్ర ఆందోళన
  • విషయంపై రక్షణ శాఖకు లేఖ రాసిన ఇద్దరు డెమొక్రటిక్ సెనేటర్లు
బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏరోస్పేస్ సంస్థ 'స్పేస్‌ఎక్స్' వ్యవహారంపై సమీక్ష జరపాలని ఇద్దరు అమెరికన్ డెమొక్రటిక్ సెనేటర్లు డిమాండ్ చేశారు. ఈ సంస్థలో చైనాకు చెందిన పెట్టుబడిదారులు రహస్యంగా వాటాలు కొనుగోలు చేశారని, ఇది అమెరికా జాతీయ భద్రతకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రక్షణ శాఖ (DOD) కార్యదర్శి పీట్ హెగ్సెత్‌కు వారు లేఖ రాశారు.

మసాచుసెట్స్‌ సెనేటర్ ఎలిజబెత్ వారెన్, న్యూజెర్సీ సెనేటర్ ఆండీ కిమ్.. రక్షణ శాఖకు రాసిన లేఖలో ఈ ఆందోళనలను ప్రస్తావించారు. స్పేస్‌ఎక్స్ రక్షణ శాఖకు ఒక ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉందని గుర్తుచేశారు. ఇటీవల బయటపడిన కోర్టు రికార్డులు, మార్చిలో వచ్చిన ఒక ప్రోపబ్లికా పరిశోధనాత్మక కథనాన్ని వారు తమ లేఖలో ఉటంకించారు. ఆఫ్‌షోర్ ఖాతాల ద్వారా స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడిదారులకు వాటాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఈ నివేదికలు ఆరోపిస్తున్నాయి.

"వ్యూహాత్మక రంగాల్లో ప్రత్యర్థి దేశాల నుంచి వచ్చే విదేశీ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ విధానాలకు ఇది విరుద్ధం. కీలకమైన సైనిక, నిఘా, పౌర మౌలిక సదుపాయాలను ఇది ప్రమాదంలో పడేస్తుంది" అని సెనేటర్లు పేర్కొన్నారు. రక్షణ శాఖతో స్పేస్‌ఎక్స్‌కు 5.9 బిలియన్ డాలర్ల లాంచ్ సర్వీస్ కాంట్రాక్టుతో సహా బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలున్నాయి. 

"మన జాతీయ భద్రతా వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న స్పేస్‌ఎక్స్ లాంటి సంస్థపై చైనా వంటి ప్రత్యర్థి దేశం పెత్తనం చెలాయించగలిగే అవకాశం ఉండడం ప్రమాదకరం" అని వారు స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని చైనా పెట్టుబడిదారులు తెలుసుకుని, అమెరికా జాతీయ భద్రతను దెబ్బతీసే ప్రమాదం ఉందని సెనేటర్లు హెచ్చరించారు. 

స్పేస్‌ఎక్స్‌లో చైనా ప్రభావంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు, ఈ భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడానికి డీఓడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో ఫిబ్రవరి 18లోగా తెలియజేయాలని వారు తమ లేఖలో కోరారు.
Elon Musk
SpaceX
China investments
US National Security
Elizabeth Warren
Andy Kim
Department of Defense
SpaceX contracts
Foreign investment
national security

More Telugu News