T20 World Cup: నేటి నుంచి టీ20 ప్రపంచకప్.. ముంబైలో అట్టహాసంగా ప్రారంభ వేడుకలు

T20 World Cup Starts Today Grand Opening Ceremony in Mumbai
  • భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం
  • తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో తలపడనున్న డిఫెండింగ్ ఛాంపియన్ భారత్
  • ప్రారంభ వేడుకల్లో బాద్‌షా, నోరా ఫతేహీ ప్రత్యేక ప్రదర్శనలు
  • ఓపెనింగ్ సెరిమనీకి ప్రత్యక్ష ప్రసారం లేదని వెల్లడి
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్, టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో యూఎస్‌ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ వేడుకల్లో ఐసీసీ ఛైర్మన్ జై షా, 2024లో భారత్‌కు టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ట్రోఫీకి స్వాగతం పలుకుతారు. టోర్నీలో పాల్గొంటున్న 20 దేశాలకు ప్రతీకగా 20 మంది చిన్నారులు వారితో జతకలవనున్నారు. అనంతరం అందరూ కలిసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్‌షా తన పాటలతో, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహీ తన డ్యాన్స్‌తో అలరించనున్నారు. చివరగా ఇద్దరూ కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే శివ‌మ‌ణి, రిష‌భ్ రిఖిరామ్ శ‌ర్మల ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఉంటాయి. 

టీ20 క్రికెట్ స్ఫూర్తికి తగ్గట్టుగా వేగంగా, ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. మైదానం మధ్యలో టోర్నీ అధికారిక లోగోను వేదికగా మార్చి ప్రదర్శనలు నిర్వహిస్తారు. కార్యక్రమం ముగింపులో అద్భుతమైన పైరోటెక్నిక్ ప్రదర్శన (బాణసంచా) ఉంటుంది. అయితే, ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యక్ష ప్రసారం గానీ, లైవ్ స్ట్రీమింగ్ గానీ ఉండవని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేవలం భారత్-యూఎస్‌ఏ మ్యాచ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియంలో దీనిని ప్రత్యక్షంగా వీక్షించగలరు.
T20 World Cup
ICC Mens T20 World Cup 2026
India
Sri Lanka
Pakistan
Netherlands
Rohit Sharma
Jay Shah
Mumbai
Cricket

More Telugu News