Shivam Dube: వైజాగ్‌లో కివీస్ ‘విశ్వరూపం’.. దూబే మెరుపులు వృథా!

Shivam Dubes efforts in vain as New Zealand dominates in Vizag
  • భారత్‌పై 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం
  • రాణించిన టిమ్ సీఫెర్ట్ (62), కాన్వే (44) 
  • 20 ఓవర్లలో 215/7 పరుగులు చేసిన న్యూజిలాండ్
  • 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన శివమ్ దూబే (65)
  • భారత్‌ తరఫున మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు
  • 3 వికెట్లతో భారత మిడిలార్డర్‌ను దెబ్బతీసిన మిచెల్ శాంట్నర్
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ జట్టు అత్యద్భుత ప్రదర్శనతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సీఫెర్ట్ భారత పేసర్లపై విరుచుకుపడుతూ 36 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు. చివర్లో డారిల్ మిచెల్ (39 నాటౌట్) మెరుపులు తోడవడంతో న్యూజిలాండ్ 215 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, అర్ష్‌దీప్ తలా రెండు వికెట్లు తీశారు.

నిలబెట్టిన దూబే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ డకౌట్ అవ్వగా, సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశపరిచాడు. సంజూ శాంసన్ (24), రింకూ సింగ్ (39) కాసేపు పోరాడినా శాంట్నర్ ధాటికి పెవిలియన్ చేరారు. భారత్ 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో శివమ్ దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇష్ సోధీ వేసిన ఒకే ఓవర్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 29 పరుగులు పిండుకున్న దూబే, టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు.

దూబే జోరు చూస్తుంటే భారత్ గెలిచేలా కనిపించింది. కానీ, బౌలర్ చేతికి తగిలి బంతి వికెట్లను తాకడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దూబే రనౌట్ అయ్యాడు. ఈ వికెట్‌తో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివరికి భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో సిరీస్‌లో న్యూజిలాండ్ తన ఖాతా తెరిచింది.

ఈ మ్యాచ్‌లో దూబే నమోదు చేసిన 15 బంతుల హాఫ్ సెంచరీ.. టీ20ల్లో భారత్ తరఫున (యువరాజ్ సింగ్ - 12 బంతులు, కేఎల్ రాహుల్/సూర్యకుమార్ - 14 బంతులు తర్వాత) మూడో అత్యంత వేగవంతమైన అర్థశతకంగా రికార్డు సృష్టించింది.
Shivam Dube
India vs New Zealand
NZ tour of India
Tim Seifert
Daryl Mitchell
Visakhapatnam T20
India T20 series
cricket
T20 records
Santner

More Telugu News