Nicolas Maduro: 30 నిమిషాల మెరుపుదాడి.. కరాకస్‌పై 150 యుద్ధ విమానాలు

30 Minutes Attack US used 150 Fighter Jets to Capture Maduro
  • అర్ధరాత్రి వేళ కరాకస్‌ను చుట్టుముట్టిన అగ్రరాజ్యం దళాలు
  • అరగంటలోనే నికోలస్ మదురో బందీ
  • దాడి కోసం 20 స్థావరాల నుంచి కదిలిన యుద్ధ విమానాలు, బాంబర్లు
  • చీకటిలో వణికిన వెనిజులా రాజధాని
  • అమెరికాలో విచారణ ఎదుర్కోనున్న మదురో
జనవరి 3, 2026.. అర్ధరాత్రి సమయం. వెనిజులా రాజధాని కరాకస్ ఆకాశం ఒక్కసారిగా యుద్ధ విమానాల గర్జనతో దద్దరిల్లింది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన 150కి పైగా అత్యాధునిక యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లు కరాకస్‌ను చుట్టుముట్టాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలో సాగిన ఈ మెరుపు ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో చిక్కారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఈ సైనిక చర్యతో దశాబ్దాల మదురో పాలనకు అగ్రరాజ్యం చరమగీతం పాడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు 'ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్' ప్రారంభమైంది. అమెరికా తనకున్న అత్యున్నత సాంకేతికతతో కరాకస్ నగరంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. నగరం చీకటిమయమైన వేళ, అమెరికా డెల్టా ఫోర్స్ కమెండోలు హెలికాప్టర్ల ద్వారా మదురో నివసిస్తున్న ‘కోట’ లాంటి భవనంపైకి దిగారు. మదురో సురక్షిత గదిలోకి వెళ్లేలోపే అమెరికా సైన్యం ఆయనను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ దాడిలో సుమారు 40 మంది మరణించినట్లు సమాచారం.

మదురోపై ఉన్న డ్రగ్స్ స్మగ్లింగ్, నార్కో-టెర్రరిజం ఆరోపణలే ఈ దాడికి ప్రధాన కారణమని అమెరికా చెబుతోంది. బంధించిన మదురోను సంకెళ్లతో న్యూయార్క్‌కు తరలించారు. అక్కడ ఆయనపై క్రిమినల్ విచారణ జరగనుంది. కాగా, వెనిజులాలో తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడే వరకు ఆ దేశ పాలనను తామే చూస్తామని ట్రంప్ ప్రకటించారు. అక్కడి భారీ చమురు నిల్వలను పునరుద్ధరించి, ఇతర దేశాలకు విక్రయించే బాధ్యతను కూడా అమెరికా తీసుకోనుంది.

 ఒక సార్వభౌమ దేశంపై అమెరికా జరిపిన ఈ దాడిని రష్యా, చైనా, క్యూబా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, స్టేట్ టెర్రరిజం అని మండిపడ్డాయి. అయితే, తన దేశ యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వెనిజులాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
Nicolas Maduro
Venezuela
Donald Trump
Caracas
US military operation
Operation Absolute Resolve
drug smuggling
narco-terrorism
US foreign policy
Venezuela crisis

More Telugu News