Nicolas Maduro: సంకెళ్లతో న్యూయార్క్‌కు మదురో!

Nicolas Maduro Captured Taken to New York After US Military Action
  • అమెరికా వైమానిక దాడులతో వణికిన కరాకస్
  • దాడుల్లో 40 మంది పౌరులు, సైనికుల మృతి 
  • నికోలస్ మదురోను బంధించిన అమెరికా సైన్యం
  • మదురో కళ్లకు గంతలు కట్టిన ఫోటో విడుదల
  • వెనిజులా పాలన, చమురుపై అమెరికా నియంత్రణ
  • అమెరికా చర్యను ఖండించిన రష్యా, చైనా
  • డ్రగ్స్ ఆరోపణలను తోసిపుచ్చిన మదురో
దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో అమెరికా సైన్యం ఊహించని రీతిలో భారీ సైనిక చర్యకు దిగింది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పౌరులు, సైనికులు మరణించారు. ఈ మెరుపు ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇరాక్ యుద్ధం తర్వాత ఒక దేశంలో అధికార మార్పిడి కోసం అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది.

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన అనంతరం అమెరికా యుద్ధ నౌకలో న్యూయార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా మదురో చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టిన ఫోటోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. న్యూయార్క్‌లోని స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేరుకున్న మదురోను, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. వచ్చే వారం ఆయనపై నార్కో-టెర్రరిజం, ఆయుధాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరారోపణలపై విచారణ జరగనుంది.

వెనిజులాలో సురక్షితమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడే వరకు ఆ దేశ పాలనా బాధ్యతలను అమెరికాయే చూస్తుందని ట్రంప్ ప్రకటించారు. "వెనిజులాను మేమే నడుపుతాం" అని ఆయన స్పష్టం చేస్తూనే.. ఆ దేశంలోని అపారమైన చమురు నిల్వలను ఇతర దేశాలకు విక్రయించి ఆదాయం పొందుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్తును అమెరికాయే నిర్దేశిస్తుందని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ దాడికి కేవలం 48 గంటల ముందే మదురో ఒక ఇంటర్వ్యూలో అమెరికాతో చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు. డ్రగ్స్ నియంత్రణ, చమురు రంగంలో అమెరికా పెట్టుబడుల విషయంలో తాము సహకరిస్తామని ఆయన ‘టెలిసూర్’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే మదురో ప్రతిపాదనలను బేఖాతరు చేస్తూ అమెరికా ఈ దాడులకు తెగబడటం గమనార్హం.

అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్యపై ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రష్యా, చైనాతో పాటు లాటిన్ అమెరికా, యూరప్ దేశాలు అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరాయి. మరోవైపు అమెరికాలోనే ఈ ఆపరేషన్ చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మదురో అరెస్టుకు డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధం లేదని, ఇది కేవలం అధికార మార్పిడి కోసం చేసిన దాడి మాత్రమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
Nicolas Maduro
Venezuela
US Military Action
Donald Trump
Narco-terrorism
Oil Reserves
Caracas
Regime Change
US Foreign Policy
New York

More Telugu News