AP CID: కంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ సీఐడీ

Cyber crime gang busted in Andhra Pradesh with Cambodia links
  • పశ్చిమ బెంగాల్ లో అంతర్జాతీయ నేరస్తుడి అరెస్ట్
  • విశాఖ, బెంగాల్‌, ఒడిశా కేంద్రంగా సిమ్‌ బాక్స్‌ కేంద్రాలు
  • 1400 సిమ్‌ కార్డుల స్వాధీనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) సైబర్ క్రైమ్ పోలీసులు ఓ భారీ అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టును రట్టు చేశారు. కంబోడియా కేంద్రంగా పనిచేస్తూ, భారతదేశంలోని అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని "డిజిటల్ అరెస్ట్", ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో కీలక సూత్రధారి అయిన వియత్నాం జాతీయుడు హొ హుడే (యుహుడే)ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1,400 సిమ్ కార్డులు, కీలకమైన సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

కేంద్ర టెలికాం విభాగం (డాట్) సహకారంతో ఏపీ సీఐడీ ఈ సంయుక్త ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కంబోడియాలోని సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ ఇంటర్నెట్ కాల్స్‌ను (VoIP) భారత్‌లోని స్థానిక మొబైల్ కాల్స్‌గా మార్చి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇందుకోసం వారు "సిమ్ ఎక్స్‌ఛేంజ్ బాక్స్‌లను" ఉపయోగించారు. విదేశం నుంచి కాల్ వస్తున్నా, బాధితుల ఫోన్లలో +91 తో మొదలయ్యే భారతీయ నంబర్ కనిపించడంతో వారు సులభంగా నమ్మి మోసపోయేవారు.

సీఐడీ అధికారుల కథనం ప్రకారం, "ఈ సైబర్ క్రైమ్ ముఠా కంబోడియా నుంచి పనిచేస్తోంది. మన దేశంలోని పలు రాష్ట్రాల్లో కంబోడియా కేంద్రంగా వీరు నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించాం. విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో వీరు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. సిమ్ బాక్స్‌ల ద్వారా విదేశీ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి బాధితులను మోసం చేస్తున్నారు" అని తెలిపారు.

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని కొన్ని సెల్ టవర్ల నుంచి అనుమానాస్పదంగా భారీ స్థాయిలో అవుట్‌గోయింగ్ కాల్స్ వెళ్తున్నట్లు టెలికాం విభాగం గుర్తించింది. ఈ సాంకేతిక సమాచారాన్ని ఏపీ సీఐడీకి అందించడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సిగ్నల్స్‌ను విశ్లేషించిన ప్రత్యేక బృందాలు, ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న వియత్నాం జాతీయుడు హొ హుడే పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు, సీబీఐ, కస్టమ్స్ అధికారులమని నమ్మించి "డిజిటల్ అరెస్ట్" పేరుతో బాధితులను భయభ్రాంతులకు గురిచేయడం, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో మోసగించడం వంటి నేరాలకు ఈ ముఠా పాల్పడుతోందని సీఐడీ వెల్లడించింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. నిందితుడికి స్థానికంగా సిమ్ కార్డులు సరఫరా చేసిన "పాత్రధారులు", కంబోడియాలో ఉన్న అసలు "సూత్రధారుల"ను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అరెస్టుతో దేశంలో జరుగుతున్న అనేక సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడినట్లయిందని అధికారులు భావిస్తున్నారు.
AP CID
Cambodia cyber crime
cyber fraud
Visakhapatnam
West Bengal
Odisha
cyber crime network
SIM cards
cyber police
telecommunications

More Telugu News