సీఎం చంద్రబాబే వీడియో కాల్ చేశారు.. నమ్మిన టీడీపీ నేతలు, చివరికి షాక్!

  • ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో తెలంగాణ టీడీపీ నేతలకు మోసం
  • సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమలా వీడియో కాల్స్
  • పార్టీ బీ-ఫామ్స్ ఇప్పిస్తానని విజయవాడకు పిలిపించిన కేటుగాడు
  • విడతలవారీగా డబ్బులు వసూలు చేసి బురిడీ
  • హోటల్ లో గొడవతో వెలుగులోకి వచ్చిన హైటెక్ మోసం
  • పరువు పోతుందని ఫిర్యాదుకు వెనుకాడిన బాధితులు
సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్న మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల ముఖాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించి, తెలంగాణ టీడీపీ నేతలను ఓ కేటుగాడు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పార్టీ టిక్కెట్లు ఇప్పిస్తానని నమ్మించి వారిని విజయవాడ రప్పించి, డబ్బులు గుంజి బురిడీ కొట్టించాడు.

అస‌లేం జ‌రిగిందంటే..! 
గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొందరు టీడీపీ నాయకులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమ పీఏనని పరిచయం చేసుకుని, కాసేపట్లో ఉమ గారు వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. చెప్పినట్టే, దేవినేని ఉమ ముఖంతో ఉన్న వ్యక్తి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన నేతలు, అతను చెప్పిన నంబర్లకు రూ.35 వేలు ఫోన్ పే ద్వారా పంపించారు.

ఈ నెల 7న అదే వ్యక్తి మరోసారి దేవినేని ఉమలా వీడియో కాల్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ బీ-ఫామ్స్ ఇప్పిస్తానని ఆశ చూపాడు. ఆశ్చర్యకరంగా, స్వయంగా సీఎం చంద్రబాబు కూడా మాట్లాడతారని నమ్మబలికాడు. కొద్దిసేపటికే చంద్రబాబు ముఖంతో ఉన్న వ్యక్తి వీడియో కాల్లో మాట్లాడి, తెలంగాణలో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించాడు. దీంతో సత్తుపల్లి నేతలు నిజంగానే సీఎం మాట్లాడారని పూర్తిగా నమ్మేశారు.

అమరావతి వస్తే బీ-ఫామ్స్ ఇప్పిస్తానని నమ్మించడంతో సత్తుపల్లికి చెందిన 18 మంది టీడీపీ నేతలు విజయవాడకు చేరుకున్నారు. మోసగాడి సూచన మేరకు బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో దిగారు. ఆ కేటుగాడు హోటల్ యాజమాన్యానికి కూడా ఫోన్ చేసి, తన వాళ్లే వస్తున్నారని, బిల్లు తానే చెల్లిస్తానని చెప్పడంతో వారూ నమ్మారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా ఎవరూ రాకపోగా, సీఎంను కలవాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలు ఇవ్వాలని మరోసారి ఫోన్ రావడంతో నేతలకు అనుమానం కలిగింది.

ఇంతలో హోటల్ సిబ్బంది భోజనాల బిల్లు రూ.26 వేలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో గొడవ మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు దేవినేని ఉమను సంప్రదించగా, తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని, ఏలూరుకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. అయితే, పరువు పోతుందనే భయంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి, హోటల్ బిల్లులో సగం చెల్లించేలా చూసి వారిని పంపించివేశారు.


More Telugu News