శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'మృత్యుంజయ్'. ఈ టైటిల్ వినగానే ఇంతవరకూ  శ్రీవిష్ణు చేస్తూ వచ్చిన సినిమాలకి  కాస్త భిన్నంగా అనిపిస్తుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ .. ఆ తరువాత అల్లరి నరేశ్ మాదిరిగా పూర్తి హాస్యకథానాయకుడిగా మారిపోయిన శ్రీవిష్ణు, మంచి పేరు సంపాదించాడు. అయితే అడపాదడపా విభిన్నమైన కథలతో కొత్తదనానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అలా ఆయన చేసిన తాజా చిత్రమే 'మృత్యుంజయ్'. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లలో విడుదలైంది. 
 
'మృత్యుంజయ్'  (శ్రీవిష్ణు) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, మేనత్త దగ్గర పెరుగుతాడు. ఒక దిన పత్రికకి సంబంధించిన ప్రకటనల విభాగంలో అతను పనిచేస్తూ ఉంటాడు. అదే పేపర్లో క్రైమ్  బ్యూరోలో పనిచేయాలనేది అతని కోరిక. అందుకోసం ప్రయత్నాలు చేస్తూనే, ప్రకటనలు సంపాదించడానికి అతను ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటాడు. ఎక్కడ ఎవరు చనిపోయినా, వాళ్ల కులమతాలకు సంబంధించిన వేషంతో అక్కడ వాలిపోతూ ఉంటాడు. 

చనిపోయినవారి అలవాట్లు .. అభిరుచులను అక్కడికక్కడే తెలుసుకుని, పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకుని ప్రకటనలు సంపాదిస్తూ ఉంటాడు. అచ్యుత్ శర్మ (బాలాదిత్య) విక్రాంత్ చనిపోయినప్పుడు కూడా అతను అలాగే వాళ్ల ఇళ్లకు వెళతాడు. వాళ్లిద్దరూ ఒకే విధమైన ప్రమాదంలో చనిపోయినట్టు తెలుసుకున్న జయ్, అవి హత్యలు కావొచ్చని భావిస్తాడు. ఈ కేసులను డీల్ చేస్తున్న ఏసీపీ సీత (రెబా మోనికా జాన్)ను కలుసుకుని, తన మనసులోని మాటను చెబుతాడు. 

ఈ నేపథ్యంలోనే అచ్యుత్ శర్మ కూతురు అంజలికి 'జయ్' చేరువవుతాడు. అచ్యుత్ శర్మను ఎవరు హత్య చేశారు? అందుకు గల కారణాలు ఏమిటి? అనేది తెలుసుకుని ఆ పాపకి చెబుతానని మాట ఇస్తాడు. అందుకు సంబంధించిన అతని అన్వేషణ 'సాధు' (వీర్ ఆర్యన్) దగ్గర ఆగుతుంది. సాధు ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? అతని ద్వారా జయ్ కి ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివి? అంజలికి ఇచ్చిన మాటను జయ్ నిలబెట్టుకోగలుగుతాడా? అనేది మిగతా కథ.

ఎవరైనా చనిపోతే ఆ ఇంటి నుంచి తెలివిగా పేపర్ ప్రకటన రాబట్టుకునే ఒక సాధారణ రిపోర్టర్, ఒక హంతకుడిని పట్టుకోవడానికి నేరుగా రంగంలోకి దిగవలసి వస్తుంది. ఆ ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. తన తండ్రి ఎందుకు చనిపోయాడనే విషయం తెలుసుకోవాలనుకున్న ఒక చిన్నారికి ఆ రిపోర్టర్ ఇచ్చిన మాటనే ఎమోషన్ ను కనెక్ట్ చేసే ప్రధానమైన అంశం.

ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా నమ్మించేలా హత్యలు జరుగుతుంటాయి. అందుకు కారకులు ఎవరనేది తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలతో ఫస్టాఫ్ గడిచిపోతుంది. తన గురించిన ఆరా తీస్తున్న అతనిని చంపడానికి విలన్ చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ నడుస్తుంది. జరిగిన హత్యల వెనకున్న కారణం ఏమిటనేది ఆడియన్స్ ను వెయిట్ చేయించే ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తూ ఉంటుంది. 

ప్రమాదవశాత్తు మరణించారని అనుకున్నవాళ్లు, హత్య చేయబడ్డారని హీరో తెలుసుకోవడానికీ .. అందుకు గల కారణాలను అన్వేషించడానికి సంబంధించిన సన్నివేశాలతోనే ఫస్టాఫ్ మొత్తాన్ని దర్శకుడు ఖర్చు చేశాడు. నానబెడుతూ .. ఆరబెడుతూ సాగే ఈ సన్నివేశాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇక సెకండాఫ్ లో నైనా కథ పుంజుకోబోతుందా? అని వెయిట్ చేసిన ప్రేక్షకులకు నిరాశనే మిగులుతుంది.

విలన్ కోసం హీరో వెదుకుతూ ఉంటే, ఆల్రెడీ హీరోను విలన్ వెంటాడుతూ ఉంటాడు. సాధారణంగా ఈ తరహా సన్నివేశాలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించేవిగా ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి ఫీలింగ్స్ కనుచూపు మేరలో కనిపించవు. సాధ్యమైనంత వరకూ ఈ ఇద్దరిపైనే ఫోకస్ చేసినప్పటికీ ఆకట్టుకునే సీన్స్ పడకపోవడం విచారకరమే. ఇక శ్రీవిష్ణుకి ఈ సినిమాలో రెబా జోడీగా కనిపించదు. అందువలన లవ్ .. రొమాన్స్ .. సాంగ్స్ అనే ఊసే లేదు. 

సాధారణంగా ఏ సినిమాలోనైనా ప్రీ క్లైమాక్స్ ను .. క్లైమాక్స్ ను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాలో ఆ రెండూ కూడా బలహీనంగానే అనిపిస్తాయి. ఏదో జరగబోతోంది అనే స్థాయిలో తెరపై పాత్రలు హడావిడి చేయడం .. ఏమీ జరగకపోవడంతో సీట్లలోని ఆడియన్స్ డీలాపడిపోతుండటం అలవాటైపోతుంది.

లవ్ .. రొమాన్స్ కి అవకాశం లేకపోయినా, శ్రీవిష్ణు మార్క్ కామెడీని వర్కౌట్ చేసినా బాగుండేది. కానీ అలా జరగలేదు. తన బలమైన కామెడీకి దూరంగా వెళ్లడం వలన శ్రీవిష్ణు బలహీనపడ్డాడు. హైటు .. పర్సనాలిటీ పరంగా చూసుకుంటే, పోలీస్ ఆఫీసర్ పాత్రకి రెబా మోనికా జాన్ సెట్ కాలేదని అనిపిస్తుంది. అయితే నటన పరంగా ఆ లోటు తెలియకుండా కొంతవరకూ చేయగలిగింది. విశాలమైన కళ్లు .. చురుకైన చూపులు ఈ పాత్రకి కొంతవరకూ బలాన్ని చేకూర్చాయి. 

విలన్ గా వీర్ ఆర్యన్ బాగానే చేశాడుగానీ, రొటీన్ గా ఆ పాత్రను డిజైన్ చేయడం వలన పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ తరహా విలన్ పాత్రలు గతంలో చాలానే చూసి చూసి ఉన్నారు.

సుదర్శన్ .. రచ్చరవి పాత్రలను పూర్తిగా ఉపాయోగించుకోలేకపోయారు. కాలభైరవ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగిందనే చెప్పాలి. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఫరావాలేదు.    

'సామజవరగమన' సినిమాలో శ్రీవిష్ణు - రెబా మోనికా జాన్ చేసిన సందడిని ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ స్థాయి ఎంటర్టైన్మెంట్ ను ఊహించుకుని వెళితే మాత్రం ఆడియన్స్ కి నిరాశ తప్పదు. ఎందుకంటే ఈ కంటెంట్ వేరు .. వాళ్ల పాత్రలను డిజైన్ చేసిన విధానం వేరు కావడమే అందుకు కారణం. ఎమోషన్ పరంగా చూసినా .. యాక్షన్ పరంగా చూసినా .. ఆకట్టుకోలేకపోయిన కంటెంట్ గానే ఇది మిగిలిపోతుంది.