Harish Rao: ఇది ఉత్తి దండగ ప్రచార పర్వం తప్ప మరొకటి కాదు: హరీశ్ రావు

Harish Rao Slams Congress Praja Palana as Wasteful Publicity
  • కాంగ్రెస్ ప్రభుత్వ 99 రోజుల ప్రణాళికపై హరీశ్ రావు విమర్శలు
  • గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఇంకా చెత్తబుట్టల్లోనే ఉన్నాయని వెల్లడి
  • రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతలను నడిరోడ్డుపైకి తెచ్చారని ఆగ్రహం
  • పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పాకులాడుతున్నారని మండిపాటు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి దండగ ప్రచార పర్వమని, ఇది ప్రజలను మభ్యపెట్టే మరో నాటకమని ఆయన ఎద్దేవా చేశారు. దాదాపు 800 రోజుల పాలనలో (రెండున్నరేళ్లు) చేసిందేమీ లేక, ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కొత్త డ్రామాకు తెరతీసిందని ఆరోపించారు.

గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుంచి స్వీకరించిన లక్షలాది దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని హరీశ్ రావు విమర్శించారు. ఆ దరఖాస్తులకే దిక్కులేదని, ఇప్పుడు మళ్లీ పది వారాల పాటు పది రకాల కార్యక్రమాలంటూ ప్రజలను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలనా వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాముల నుంచి తప్పించుకునేందుకే ఈ ‘డైవర్షన్ ప్లాన్’ రచించారని మండిపడ్డారు. మీ పాలనలో సగం కాలం పూర్తయినా ఇంకా ఎన్ని రోజులు ప్రచారాలతో నెట్టుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో రైతుల దయనీయ స్థితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పంట కోతల సమయం వచ్చినా ఈ సీజన్ రైతు భరోసా ఇవ్వలేదని, గత సీజన్ పంట బోనస్ ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం యూరియా కూడా సరఫరా చేయలేక అన్నదాతలను నడిరోడ్డు మీదకు ఈడ్చారని, నమ్మించి గొంతుకోసిన ఈ మోసాల గురించి ఇప్పుడు గ్రామసభల్లో రైతులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 

అలాగే యువతకు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, జాబ్ క్యాలెండర్‌ను 'జాబ్ లెస్' క్యాలెండర్‌గా మార్చేశారని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో లూటీకి ప్రాధాన్యత ఇస్తూ, నోటిఫికేషన్లను గాలికి వదిలేశారని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు మూలనపడ్డాయని, ఇప్పుడు నైపుణ్య శిక్షణ అంటూ కొత్త పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి అంటూ ప్రభుత్వం పేర్లు గొప్పగా చెబుతున్నా.. వాస్తవానికి ఆసుపత్రుల్లో మందులు లేక, బడుల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడం, పారిశుద్ధ్యం నిర్వహించడం కనీస బాధ్యత అని, దానిని కూడా ఒక ఈవెంట్‌లా మార్చుకోవడం, గొప్పగా చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. 

సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలన్నీ కేవలం పత్రికల్లో పబ్లిసిటీ కోసమే తప్ప, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు. పాలనను గాలికి వదిలి పబ్లిసిటీ గారడీలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గ్రామ గ్రామాన ప్రజలు సిద్ధంగా ఉన్నారని హరీశ్ రావు హెచ్చరించారు.
Harish Rao
Telangana Congress
Praja Palana
Revanth Reddy
BRS
Telangana Politics
Farmer Issues
Job Notifications
Government Schemes
Telangana Government

More Telugu News