child rape and murder: చిన్నారి హత్యాచారం కేసు.. ఉరిశిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court Acquits Dashwanth in Tamil Nadu Child Rape Murder Case
  • పోలీసుల విచారణను తప్పుబడుతూ నిందితుడి విడుదల
  • సీసీటీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలను పోలీసులే సృష్టించినట్లు ఉందని వ్యాఖ్య
  • ఇతర కేసులు ఏవీ లేకుంటే వెంటనే జైలు నుంచి రిలీజ్ చేయాలని ఆదేశం
  • 2017 లో తమిళనాడులో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి హత్యాచారం
తమిళనాడులో 2017లో సంచలనం సృష్టించిన ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు దశ్వంత్ కు హైకోర్టు విధించిన ఉరి శిక్షను నిలిపివేసింది. దశ్వంత్ ను దోషిగా నిర్ధారించడంలోను, మరణశిక్ష విధించడంలోను న్యాయస్థానం అత్యుత్సాహం ప్రదర్శించిందని వ్యాఖ్యానించింది. పోలీసుల విచారణ పూర్తిగా ఏకపక్షంగా సాగిందని, సీసీటీవీ ఫుటేజీతో పాటు పోలీసులు కోర్టు ముందుంచిన సాక్ష్యాల్లో పలు లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది.

దశ్వంత్ కు తనను తాను కాపాడుకునే అవకాశాన్ని పోలీసులు, కింది కోర్టు కల్పించలేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దశ్వంత్ ను నిర్దోషిగా తేలుస్తూ ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్లు బుధవారం తీర్పు వెలువరించింది. దశ్వంత్ పై ఇతర కేసులు ఏవీ లేకుంటే వెంటనే అతడిని జైలు నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్‌ విక్రమ్‌ సేథ్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

విచారణలో కీలక వ్యాఖ్యలు..
ఈ కేసు విచారణలో భాగంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలతో పాటుగా ఇతర ముఖ్యమైన పరిస్థితులను వివరించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 2018 ఫిబ్రవరి 19వ తేదీన దశ్వంత్‌ని దోషిగా నిర్ధారించి కోర్టు.. అదే రోజు అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడాన్ని ప్రస్తావించిన ధర్మాసనం.. ఇందుకు కోర్టు అనవసర ఉత్సాహం చూపిందని అభిప్రాయపడింది.

చిన్నారిపై అత్యాచారం, హత్య
2017 ఫిబ్రవరి 6న చెన్నైలోని ముగలివాక్కంలో ఆరేళ్ల బాలిక హాసిని హత్యకు గురైంది. హత్య చేయడానికి ముందు నిందితుడు బాలికపై అత్యాచారం చేసినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో బాలిక ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉండే దశ్వంత్ అనే యువకుడిని పోలీసులు నిందితుడిగా తేల్చారు. విచారణ తర్వాత ట్రయిల్ కోర్టు దశ్వంత్ కు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును దశ్వంత్ హైకోర్టులో సవాల్ చేయగా, అక్కడ అతనికి చుక్కెదురైంది. హైకోర్టు కూడా ఉరిశిక్షనే ఖరారు చేసింది. దాంతో దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. తాజాగా విచారించిన సుప్రీంకోర్టు.. దశ్వంత్ ను నిర్దోషిగా పేర్కొంటూ, అతని విడుదలకు ఆదేశించింది.
child rape and murder
Tamil Nadu
rape case
Dashwanth
Supreme Court verdict
Hasini murder case
Mugaliwakkam case
child rape case India
death penalty India
justice Sandeep Mehta
justice Vikram Seth
justice Sanjay Karol

More Telugu News