జుబిన్ గార్గ్ అంతిమయాత్రకు ప్రపంచ రికార్డు... లక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు!

  • అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంతిమయాత్రకు అరుదైన రికార్డు
  • లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అంత్యక్రియలు
  • లక్షలాదిగా తరలివచ్చి నివాళులర్పించిన అభిమానులు
  • ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
  • సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన గాయకుడు
అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జుబిన్ గార్గ్ (52) అంతిమయాత్ర ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. లక్షలాది మంది అభిమానులు కన్నీటి నివాళులు అర్పించిన ఈ యాత్ర.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్, క్వీన్ ఎలిజబెత్-2 వంటి ప్రముఖుల తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్న అంత్యక్రియగా ఇది నిలిచింది.

మంగళవారం గౌహతిలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన జుబిన్ గార్గ్ అంత్యక్రియలకు అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. ఎండ, వానను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన గాయకుడి చిత్రపటాలు, కటౌట్‌లు చేతబూని, ఆయన ఆలపించిన గీతాలను పాడుతూ కన్నీటి వీడ్కోలు పలికారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. ఒక కళాకారుడి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సెప్టెంబర్ 19న సింగపూర్‌లో జుబిన్ గార్గ్ మరణించిన విషయం తెలిసిందే. తొలుత ఆయన స్కూబా డైవింగ్ చేస్తూ మరణించారని వార్తలు వచ్చినా, వాటిని నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకులు ఖండించారు. ఓ విహార నౌకలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక మృతిచెందినట్లు వారు స్పష్టం చేశారు.

మంగళవారం ఉదయం అసోం ప్రభుత్వ లాంఛనాలతో జుబిన్ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అస్సామీ, హిందీ, తమిళం సహా పలు భాషల్లో పాటలు పాడిన జుబిన్.. సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.


More Telugu News