స్కూల్‌లో నిద్రపోయిన చిన్నారి.. తాళం వేసి వెళ్లిపోయిన సిబ్బంది.. కిటికీలో ఇరుక్కుపోయిన తల.. రాత్రంతా నరకయాతన!

స్కూల్‌లో నిద్రపోయిన చిన్నారి.. తాళం వేసి వెళ్లిపోయిన సిబ్బంది.. కిటికీలో ఇరుక్కుపోయిన తల.. రాత్రంతా నరకయాతన!

School Girl Locked in Odisha School Overnight Head Stuck in Window
  • ఒడిశాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన
  • కిటికీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో తీవ్ర గాయాలు
  • కిటికీ ఊచల మధ్య ఇరుక్కుపోయిన పాప తల
  • స్కూల్ సిబ్బందిపై గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం
ఒడిశాలో పాఠశాల సిబ్బంది ఘోర నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూల్ గదిలోనే నిద్రపోయిన రెండో తరగతి బాలికను గమనించకుండా తాళం వేసి వెళ్లిపోవడంతో ఆ పాప రాత్రంతా నరకయాతన అనుభవించింది. బయటకు వచ్చే ప్రయత్నంలో కిటికీ ఊచల మధ్య తల ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. ఈ హృదయ విదారక ఘటన కియోంఝర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

గురువారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, రెండో తరగతి చదువుతున్న ఓ బాలిక తరగతి గదిలోనే నిద్రలోకి జారుకుంది. ఆ చిన్నారి లోపల ఉన్న విషయాన్ని గమనించని సిబ్బంది గదికి తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి అయినా పాప ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి రాత్రంతా గాలించినా ఫలితం లేకపోయింది.

ఉదయాన్నే పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు ఓ గది కిటికీ ఊచల మధ్య తల ఇరుక్కుని, తీవ్ర గాయాలతో వేలాడుతున్న చిన్నారి కనిపించింది. ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ఎంతో శ్రమించి బాలికను బయటకు తీసి ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పాఠశాల టీచర్ సంజిత స్పందిస్తూ "సాధారణంగా మా స్కూల్ వంట మనిషి గదులకు తాళాలు వేస్తారు. కానీ భారీ వర్షం కారణంగా ఆయన రాలేదు. సాయంత్రం 4:10 గంటలకు మేము గదులు మూసేటప్పుడు ఏడో తరగతి విద్యార్థులిద్దరిని తాళాలు వేయమని పంపించాం. అయితే, రెండో తరగతి పాప బెంచీ కింద నిద్రపోవడంతో ఆ విద్యార్థులు గమనించలేదు" అని వివరించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
Advertisement
School Girl
Odisha school
school negligence
Keonjhar district
locked in school
child safety
school incident
government school

More Telugu News