నాకు మాస్ హీరోయిన్ కావాలని ఉంది.. దానికోసం ఆ ప‌ని మాత్రం చేయ‌ను: నిధి అగర్వాల్

  • ‘హరిహర వీరమల్లు’లో ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్టిన నిధి అగర్వాల్
  • ఈ నెల 24 ప్రేక్ష‌కుల ముందుకు సినిమా 
  • ప్ర‌స్తుతం మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న బ్యూటీ
  • తనకు మాస్ హీరోయిన్‌గా గుర్తింపు రావాలని ఉందన్న నిధి
  • కానీ, దానికోసం బికినీ, లిప్‌లాక్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయ‌నని వెల్ల‌డి
ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌తో కలిసి నిధి అగర్వాల్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నెల 24న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో గ‌త కొన్నిరోజులుగా ఆమె ఈ మూవీ ప్రచార‌ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ... తనకు మాస్ హీరోయిన్‌గా గుర్తింపు రావాలని ఉందని చెప్పింది. అయితే, యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చారు. మాస్ ఇమేజ్ రావాలంటే బికినీ, లిప్‌లాక్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది కదా? అని అడ‌గ్గా, దానికి నిధి స్పందిస్తూ.. అలాంటివి తాను చేయను అన్నారు. త‌న‌ హద్దులు త‌న‌కు తెలుసు అని అన్నారు. 

తాను త‌న తల్లిదండ్రులతో కలిసి చూడలేని సన్నివేశాల్లో నటించన‌ని చెప్పారు. అలాంటి సన్నివేశాలు చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వొచ్చని పేర్కొన్నారు. దాని కోసం తాను కష్టపడి పనిచేస్తాన‌ని, మంచి కథలు ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాన‌ని నిధి అగ‌ర్వాల్ చెప్పుకొచ్చారు.

ఇక‌, ‘హరిహర వీరమల్లు’లో తన పాత్రకు న్యాయం చేయడానికి ఆమె భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి ప్రత్యేక శిక్షణలు తీసుకున్న‌ట్లు చెప్పారు. సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశం భరతనాట్య నేపథ్యంతో ఉంటుందని, అలాగే తన పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉందని నిధి వెల్లడించారు. 




More Telugu News