ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎంకు షాక్.. కుమారుడిని అరెస్టు చేసిన ఈడీ

  • మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చైతన్య అరెస్టు
  • ఈ కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు
  • అధికారులకు సహకరించకపోవడంతో అదుపులోకి తీసుకున్న ఈడీ
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈరోజు అరెస్టు చేసింది. ఉదయం బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు, అనంతరం చైతన్యను అదుపులోకి తీసుకున్నారు.

మద్యం కుంభకోణంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో చైతన్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, మద్యం సిండికేట్‌కు రూ. 2 వేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ ముఖ్యమంత్రి నివాసంలో సోదాలు చేపట్టారు. చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.


More Telugu News