అహ్మ‌దాబాద్‌లో ఐపీఎల్ ఫైన‌ల్‌..?

  • మే 17న ఐపీఎల్ పునఃప్రారంభం
  • 27 వ‌ర‌కు ఆరు వేదిక‌ల్లో లీగ్ మ్యాచ్ లు
  • మే 29 నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్ లు ప్రారంభం
  • ప్లేఆఫ్‌లను నిర్వహించే వేదిక‌లను ఇంకా ప్రకటించని బీసీసీఐ 
  • అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్ 2తో పాటు ఫైనల్‌ను నిర్వ‌హించాల‌ని యోచ‌న‌
భారత్‌, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఒక వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్‌ తాజా సీజన్ ఈ నెల‌ 17న తిరిగి ప్రారంభం కానుంది. ఆరు వేదిక‌ల్లో మే 17 నుంచి 27 వ‌ర‌కు మిగిలిన లీగ్ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌ర్వాత మే 29 నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్ లు ప్రారంభ‌మ‌వుతాయి. మే 29న‌ క్వాలిఫయర్‌-1, మే 30న ఎలిమినేటర్‌, జూన్‌ 1న క్వాలిఫయర్‌-2, జూన్‌ 3న ఫైనల్‌ జరగనున్నాయి. 

ఈ మేర‌కు బీసీసీఐ సవరించిన షెడ్యూల్‌ను నిన్న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. మిగిలిన లీగ్‌ మ్యాచ్‌ల కోసం జైపూర్‌, ముంబయి, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలను ఖరారు చేసింది. ఇలా లీగ్ మ్యాచ్ ల‌ వేదికలు ఇప్పటికే నిర్ణయించబడినప్పటికీ, ప్లేఆఫ్‌లను నిర్వహించే వేదిక‌లను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.

అయితే, తాజా నివేదిక‌ల ప్రకారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2తో పాటు ఫైనల్‌ను నిర్వ‌హించాల‌ని బీసీసీఐ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కోల్‌క‌తా వేదిక‌గా జ‌ర‌గాల్సిన ఈ మ్యాచ్‌ను ఇక్క‌డికి మార్పు చేసిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. అయితే, వాతావరణ సూచన ఆధారంగా ఈ ప్రణాళికలు మారవచ్చని స‌మాచారం. 

బోర్డు ప్రస్తుతం వేదికల వద్ద వర్షం పడే అవకాశాలను పర్యవేక్షిస్తోంది. ఈ నేప‌థ్యంలో జూన్ ప్రారంభంలో అహ్మదాబాద్‌లో ఎటువంటి వర్షాలు ఉండవని భావించి, ఇదే వేదిక‌లో ఫైన‌ల్ నిర్వ‌హించాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ విష‌యానికి వ‌స్తే ముంబ‌యి వేదిక‌ ఒక చాయిస్ గా ఉంది. 

కానీ, ఇది దేశంలో రుతుపవనాల రాకపై ఆధారపడి ఉంటుందని 'క్రిక్‌బజ్' పేర్కొంది. కొన్ని రోజుల క్రితం వాణిజ్య రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. అటు ఇదే స‌మ‌యంలో వర్షం ప్రభావం అంత‌గా ఉండ‌ని ఢిల్లీ, జైపూర్ వంటి ఉత్తర భారత వేదికలను బీసీసీఐ ఎంచుకునే అవకాశం ఉంద‌ని స‌మాచారం.


More Telugu News