బంగ్లాదేశ్ తో బంధాలు బలహీనపడిన వేళ... మహమ్మద్ యూనస్ కు మోదీ లేఖ
- నిన్న 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న బంగ్లాదేశ్
- యూనస్ కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి... భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ దేశంలో హిందువులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య బంధాలు బలహీనపడ్డాయి.
హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని ఆ దేశం కోరినప్పటికీ భారత్ స్పందించలేదు. మరోవైపు భారత్-బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని ఇరు దేశాలు చెపుతూ వస్తున్నాయి. ఇటీవల మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ... ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇంకోవైపు ఏప్రిల్ 3, 4 తేదీల్లో థాయ్ లాండ్ లో 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' (బిమ్ స్టెక్) కూటమి సదస్సు జరగనుంది. ఈ సమావేశాల సందర్భంగా మోదీ, మహమ్మద్ యూనస్ ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతుందనే వార్తలు వచ్చినప్పటికీ... వీరి మధ్య సమావేశం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భారత అధికారులు అభిప్రాయపడుతున్నారు.