జ్యోతిష్కుడిని చంపి పెట్రోలు పోసి తగలబెట్టిన భార్యాభర్తలు

Wife and husband kills astrologer in Vizag
  • విశాఖపట్నం జిల్లాలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
  • తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో హత్యకు కుట్ర
  • జ్యోతిష్కుడిని పొడిచి చంపిన నిందితుడు
విశాఖపట్నం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. జ్యోతిష్కుడిని దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు, ఆపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు. భీమిలి మండలంలోని నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక భార్యాభర్తలు. ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో వీరు నివాసం ఉంటున్నారు.

జ్యోతిష్కుడు అప్పన్న (50)తో పూజలు చేయించుకోవడం కోసం మౌనిక ఈ నెల 7న ఆయనను ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని మౌనిక తన భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి అప్పన్నను హత్య చేయాలని నిర్ణయించి ప్రణాళిక రచించారు. ఈ నెల 9న అప్పన్నను కలిసిన చిన్నారావు తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని, పూజలు చేయాలంటూ బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. బోయపాలెం-కాపులుప్పాడ మార్గంలో కల్లివానిపాలేనికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి, చాకుతో అప్పన్నపై దాడిచేసి చంపేశాడు. 

ఈ క్రమంలో చేతికి గాయం కావడంతో తర్వాతి రోజున కేజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాతి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జ్యోతిష్కుడి మృతదేహం పడివున్న ప్రాంతానికి వెళ్లి పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద ఆస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభంచిన పోలీసులు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Crime News
Visakhapatnam
Bheemili
Andhra Pradesh

More Telugu News