మోదీ బీసీ అయితే మాకేంది? ఓసీ అయితే మాకేంది?: కవిత
- బీసీల జనాభాను కరెక్ట్ గా లెక్కించాలనేదే తమ డిమాండ్ అన్న కవిత
- కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపాటు
- రాష్ట్రంలో కేసీఆర్ ను తలుచుకోని గుండె లేదని వ్యాఖ్య
మోదీ బీసీ అయితే మాకేంది? ఓసీ అయితే మాకేంది? అని కవిత అన్నారు. బీసీల జనాభాను కరెక్ట్ గా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. పక్కా లెక్కలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు పెట్టాలని... దాన్ని కేంద్రంలో బీజేపీ ఆమోదించాలని అన్నారు. ఇది చేయకుండా మోదీ కులం గురించి, రాహుల్ మతం గురించి మాట్లాడుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని హెచ్చరించారు. వంకర టింకర మాటలు మాట్లాడుతూ ప్రజలను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు.
14 నెలల పాలనలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని అన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ను తలుచుకోని గుండె లేదని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే... కేసీఆర్ ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అందరి ఆశీర్వాదంతో, తన శక్తియుక్తులతో రాష్ట్రాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళతారని అన్నారు.