చిట్టినాయుడు డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నాడు: కేటీఆర్
- రైతులు పొలాల్లో కన్నీరు పెడుతున్నారన్న కేటీఆర్
- కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మండిపాటు
- అకాల వర్షాలకు కల్లాలల్లో, మార్కెట్ యార్డలలో ధాన్యం తడిసిందన్న కేటీఆర్
కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందన్నారు. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని... కానీ ఈరోజు వరకు రైతుబంధు వేయలేదని ఆరోపించారు. ఇక రూ.15 వేల రైతుభరోసా ఊసే లేదన్నారు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు చాలాచోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నారని, అక్టోబర్ నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కానీ, అక్టోబర్ 28 వరకు 913 మంది రైతుల నుంచి 7,629 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. రైతన్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యమని విమర్శించారు. దళారులతో కుమ్మక్కైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనే లేదన్నారు.