దుర్గం చెరువులోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా గురి.. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు పలువురికి నోటీసులు
- 204 భవనాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు
- రాజకీయ, సినీ రంగాలతో పాటు పలువురు అధికారుల ఇళ్లకు నోటీసులు అందినట్టు సమాచారం
- యజమానుల్లో మొదలైన గుబులు
- దుర్గం చెరువు చుట్టూ వెలసిన విలాసవంత భవనాలు
రాంనగర్‌లో ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. అధికారులతో రిపోర్టులు తెప్పించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లో ఆక్రమణలను ఆయన పరిశీలించారు. బుధవారం సాయంత్రం రంగనాథ్ పర్యటించారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమంగా భవనాలు నిర్మించారని, మణెమ్మ వీధిలో రోడ్డు ఇరుకుగా మారిపోయిందంటూ అందిన ఫిర్యాదుల పరిశీలన కోసం ఆయన వెళ్లారు. సంబంధిత స్థలాల పత్రాలను పరిశీలించాలని అధికారులకు రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.