MS Dhoni: ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నై మేనేజ్‌మెంట్‌ ఏం చెప్పిందంటే..!

MS Dhoni Not Quitting Yet says CSK Management
షార్ట్స్‌లో చూడండి
2024 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) క‌థ‌ ముగిసింది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటికే ఇంటిబాట పట్టింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ జట్టు మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీపై పడింది. ఎంఎస్‌డీ వచ్చే సీజన్ ఆడడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, రిటైర్మెంట్‌పై ధోనీ ఇంకా స్పందించలేదు. శ‌నివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) తో మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటుందని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. 

కానీ, అలాంటిదేమీ జరగలేదు. మ‌హేంద్రుడు తన వీడ్కోలు గురించి ఎక్కడా బ‌య‌ట‌పెట్ట‌లేదు. తాజాగా ఇదే విష‌య‌మై చెన్నై మేనేజ్‌మెంట్‌ స్పందించింది. "ధోనీ రిటైర్మెంట్ గురించి చెన్నై జట్టులో ఎవరికీ చెప్పలేదు. ఈ విషయంలో కాస్త సమయం తీసుకుంటాడు అనుకుంటున్నాం. అతడు ఓ నిర్ణయానికి వస్తే కచ్చితంగా మేనేజ్‌మెంట్‌తో చెప్తాడు" అని సీఎస్‌కే వర్గాలు వెల్ల‌డించాయి. 

ఇక ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద‌ర‌గొట్టాడు కెప్టెన్ కూల్‌. కొన్ని మ్యాచుల్లోనైతే పాత ధోనీని కూడా గుర్తు చేశాడు. ఈ సీజ‌న్‌లో ధోనీ ప్రదర్శన అతని వ‌ద్ద ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంద‌ని గుర్తు చేసింది కూడా. 42 ఏళ్ల అతను సీఎస్‌కే తరపున అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడాడు. 53.67 సగటు, 220.5 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు. 

ఇక ముంబై ఇండియన్స్ (ఎంఐ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) పై ఎంఎస్‌డీ అద్భుతమైన నాక్‌లు అతని పాత‌ రోజులను అభిమానులకు గుర్తు చేశాయి. కాగా, రాబోయే ఐపీఎల్‌ మెగా వేలం ధోనీ భవిష్యత్తును నిర్ణ‌యించ‌నుంది. ఎందుకంటే ఈసారి ఫ్రాంచైజీలు త‌మ‌ ఆటగాళ్ల రిటెన్షన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో.. సీఎస్‌కే మ‌హీని అంటిపెట్టుకుంటుందా? లేదా? అనేది తెలియ‌దు. కానీ, ధోనీ క్రికెట్‌లో కొన‌సాగినంత కాలం చెన్నై అత‌డిని వ‌దిలిపెట్టుకోద‌నేది అభిమానుల మాట‌.
Go Back to Shorts
MS Dhoni
CSK
IPL 2024
Cricket
Sports News

More Telugu News