Advertisement

లోకేశ్ కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం

Nara Brahmani election campaign for Lokesh in Mangalagiri
  • మంగళగిరిలో వివిధ వర్గాల ప్రజలను కలిసిన నారా బ్రాహ్మణి
  • యర్రబాలెం సంధ్యా స్పైసెస్ వద్ద మహిళలతో మాట్లాడిన వైనం
  • చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన బ్రాహ్మణి 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. తన భర్త లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. 

యర్రబాలెం గ్రామంలో సంధ్యా స్పైసెస్ వద్ద మహిళా గ్రూపుల సభ్యులను కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ తయారయ్యే మసాలా పొడులను పరిశీలించారు. సంస్థ నిర్వాహకులను అడిగి వాటి వివరాలు తెలుసుకున్నారు. 

అంతేకాదు, మిరపకాయలు వలిచి ఉపాధి పొందుతున్న మహిళలతో నారా బ్రాహ్మణి ముచ్చటించారు. గతంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు తమకు భోజనానికి ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నామని వారు బ్రాహ్మణికి వివరించారు. ఈ విషయాన్ని నేను తప్పకుండా లోకేశ్ సార్ కు చెబుతాను అని బ్రాహ్మణి బదులిచ్చారు. 

ఇక, చంద్రబాబు గారు తీసుకువస్తున్న సూపర్ సిక్స్ గురించి మీకు తెలుసా? అని వారిని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు, సూపర్ సిక్స్ పథకాలను వారికి వివరించారు. మహిళలు బాగుండాలని చంద్రబాబు ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తి అని, ఇంట్లో కూడా ఆయన తమను ఎంతో ప్రోత్సహిస్తుంటారని, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెబుతుంటారని బ్రాహ్మణి వివరించారు. 

ఈ పర్యటనలో భాగంగా ఆమె చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లోనూ పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు తీసుకువచ్చిన కేక్ ను కట్ చేసి వారి ఆనందంలో పాలుపంచుకున్నారు.
Advertisement
Nara Brahmani
Nara Lokesh
Election Campaign
TDP

More Telugu News