క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ రేట్లు తగ్గించట్లేదేం?: మోదీని నిలదీసిన కేటీఆర్
- ప్రతీ భారతీయుడూ దీనిపై ఆలోచించాలని కోరిన మాజీ మంత్రి
- 2014 నుంచి ఇప్పటి వరకు క్రూడాయిల్ ధర 20 డాలర్లు తగ్గిందని వివరణ
- కొండెక్కిన పెట్రోల్ రేటు మాత్రం కొంచెం కూడా తగ్గలేదని మండిపాటు
- గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేటీఆర్
గడిచిన దశాబ్దంలో పెట్రోల్ ధర రూ.35, డీజిల్ ధర రూ.40 వరకు పెరిగిందని చెబుతూ దీనికి బాధ్యులెవరని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెరగడానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటూ నిలదీశారు. 2014 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.72.26, డీజిల్ ధర రూ.55.49, క్రూడ్ ఆయిల్ ధర 105.56 డాలర్లు ఉండేవని, ప్రస్తుతం 2024 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.107.41, డీజిల్ ధర రూ.95.65, క్రూడ్ ఆయిల్ ధర 86.44 డాలర్లు ఉందని కేటీఆర్ చెప్పారు. ఇక, గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పట్లో మోదీ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ.. రూపాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందని, రూపాయి విలువ పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వ అవినీతే కారణమని మోదీ చెప్పారన్నారు.
