హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కరోనా.. ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్న నిలోఫర్ వైద్యులు

14 Month baby infected to covid in Hyderabad
  • తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి
  • ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స
  • పాప కోలుకుంటోందన్న వైద్యులు
జేఎన్.1 వైరస్ రూపంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ దేశంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తాజాగా, హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారి కరోనాతో నిలోఫర్ ఆసుపత్రిలో చేరింది. నాంపల్లిలోని ఆగాపుర ప్రాంతానికి చెందిన ఈ పాప తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది.

పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. అనంతరం ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో చిన్నారి పరిస్థితి దృష్ట్యా వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స చేయడం జరిగిందనీ, ప్రస్తుతం దానిని తొలగించి ఆక్సిజన్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి కేసుల సంఖ్య 20కి చేరింది. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మిగతా 19 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్త కేసుల్లో నాలుగు హైదరాబాద్‌లో నమోదు కాగా, మెదక్, రంగారెడ్డిలో చెరో కేసు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Corona Virus
JN.1Variant
COVID19
Niloufer Hospital
Nampally

More Telugu News