సీఎం జగన్ ఇసుక దోపిడీని బయట పెట్టినందుకే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు: టీడీపీ నేత పట్టాభిరామ్
- ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వడమే చంద్రబాబు నేరమా అని ఆగ్రహం
- చంద్రబాబును శిక్షించాలని కేసు పెట్టడం దుర్మార్గమని వ్యాఖ్య
- సీఐడీ నమోదు చేసిన కేసులో స్పందించిన పట్టాభిరామ్
జగన్‌రెడ్డి పాల్పడిన రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీకి అన్ని రకాలుగా సహకరించిన వ్యక్తి వెంకటరెడ్డి అని, ఆ వ్యక్తే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని పట్టాభిరామ్ విమర్శించారు. వెంకటరెడ్డి పెద్ద అవినీతి తిమింగలమని వ్యాఖ్యానించారు. ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచడంతోనే సీనరేజ్ ఫీజు రూపంలో రాష్ట్రానికి ఆదాయం నష్టం జరిగిందని పేర్కొన్నారు. టెండర్ విధానాన్ని కొనసాగించి ఉంటే కోట్ల రూపాయల రాబడి వచ్చేదని అన్నారు. ఇసుకను ఉచితంగా ఎలా ఇస్తారని పేర్కొనడం తప్ప సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అవినీతి ఆరోపణలను నిరూపించే ఒక్క అంశం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్, ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసుల్లో సీఎం జగన్ ఒక్క సాక్ష్యాన్ని కూడా కోర్టుల్లోగానీ, ప్రజల ముందుగానీ ఉంచలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.