మీ దృష్టిలో న్యాయం.. ధర్మం.. నిజాయతీ అంటే ఏమిటో?: పురందేశ్వరిని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
- వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబుపై కేసు అన్యాయమా? అని విజయసాయి ప్రశ్న
- న్యాయాన్ని ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తూ.. మళ్లీ న్యాయం గెలవాలని ఆందోళనా? అని నిలదీత
- న్యాయ వ్యవస్థకు చంద్రబాబు తలనొప్పిలా మారారని విమర్శ
న్యాయాన్ని ఓడించేందుకు ఓ పక్క కోట్లు ఖర్చు చేస్తూ పేరు మోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తున్నారని, మరోవైపు న్యాయం గెలవాలని ఆందోళన చేస్తుండడం వింతే కదా? అని పురందేశ్వరిని ఉద్దేశించి ప్రశ్నించారు. మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయతీ అంటే అర్థం ఏమటని నిలదీశారు. వేల కోట్లరూపాయల కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబుపై కేసు పెట్టడం అన్యాయమా? అని ప్రశ్నించారు.
ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు 50కిపైగా పిటిషన్లు వేశారని, కోర్టులు వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతూనే ఉన్నాయని విమర్శించారు. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో తెలియనంత గందరగోళంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టుకు ఆయనో తలనొప్పిలా మారాడని, న్యాయ వ్యవస్థ అంతా గమనిస్తూనే ఉందని విజయసాయి హెచ్చరించారు.