గుంటూరు మేయర్‌పై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం
- మేయర్ ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్య
- జనసేన ఎప్పుడూ హింసను ప్రోత్సహించదన్న నాదెండ్ల
- పోలీసులు కేసు నమోదు చేయకుంటే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసులే బాధ్యులవుతారని వ్యాఖ్య
జనసేన పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదని, అలాంటివాటిలో పాల్గొనదని చెప్పారు. మేయర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని, అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నగర మేయర్ మళ్లీ మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గుంటూరు మేయర్‌పై జిల్లా ఎస్పీ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కనుక కేసు నమోదు చేయకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పోలీసులు బాధ్యులు అవుతారన్నారు. దీని గురించి తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.
మేయర్ ఇష్టారీతిన మాట్లాడుతుంటే సమర్థిస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఏదైనా పొరపాటు చేసినా అధికార యంత్రాంగం మద్దతుగా ఉంటుందని ప్రజలు భావిస్తారని, కానీ ఓ వ్యక్తిని వెనకేసుకు రావడం ఏమిటన్నారు. మేయర్ మాట్లాడిన మాటలు కనీసం ఆయన కుటుంబ సభ్యులు హర్షిస్తారా? అని ప్రశ్నించారు. కుట్ర, కుళ్లు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు, మేయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది. లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. దీంతో జనసేన పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.