ప్రజలంతా తప్పనిసరిగా వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులు ధరించాలి: పవన్ కల్యాణ్
- నేడు ప్రపంచ చేనేత దినోత్సవం
- సునిశిత హస్త కళలకు భారత్ పుట్టినిల్లు అని పేర్కొన్న పవన్
- అగ్గిపెట్టెలో పట్టే చీరను రూపొందిస్తే ప్రపంచమే అబ్బురపడిందని వెల్లడి
- చేనేత కుటుంబాలకు ప్రభుత్వాలు, ప్రజలు అండగా నిలవాలని పిలుపు
అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన నేత కళాకారులు రూపొందిస్తే, ఆ గొప్పదనం చూసి ప్రపంచం అబ్బురపడిందని పవన్ కల్యాణ్ వివరించారు. నేడు ప్రపంచ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సమయాన, ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"ఆధునిక కాలంలో చేనేత కళ కాస్తంత మసకబారింది. చేనేతకు పూర్వవైభవం తీసుకువరావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు సైతం తమ వంతు సహకారం అందించాలి. ప్రజలంతా తప్పనసరిగా వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులను ధరించాలి. ఘన చారిత్రక నేపథ్యం ఉన్న చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను నేను అంకితం చేసుకోవడం అదృష్టంగా భావిస్తాను. ఈ కళనే నమ్ముకుని, ఈ కళను సజీవంగా నిలుపుతూ జీవిస్తున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎల్లవేళలా అండగా నిలబడాలని కోరుకుంటున్నాను" అంటూ పవన్ తన ప్రకటనలో తెఇపారు.