wedding gift blast: పెండ్లింట్లో పేలిన గిఫ్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. వధువు మాజీ బాయ్ ఫ్రెండ్ కుట్ర

Girls Ex lover Gifts Home Theatre Bomb As Wedding Gift To Kill Them
  • తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లాడిందని నవ వధువుపై కోపం
  • హోంథియేటర్ లో బాంబు పెట్టి గిఫ్ట్ ఇచ్చిన నిందితుడు
  • ఓపెన్ చేసి చూస్తుండగా పేలిన బాంబు.. కొత్త పెళ్లికొడుకు మృతి
  • ఛత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో దారుణం
పెళ్లి కానుకలు తెరిచి చూస్తుండగా పేలుడు జరిగి ఛత్తీస్ గఢ్ లో కొత్త పెళ్లి కొడుకు చనిపోయిన విషయం తెలిసిందే! ఛత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లా చమరి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో పెళ్లికొడుకు సోదరుడు కూడా మృత్యువాత పడ్డారు. గిఫ్ట్ లో బాంబు అమర్చి ఉంటారని అనుమానించి దర్యాఫ్తు చేసిన పోలీసులకు సంచలన విషయం తెలిసింది. పెళ్లికూతురుపై కోపంతో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఈ దారుణానికి తెగబడ్డాడని బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చమరి గ్రామానికి చెందిన హేమేంద్రకు మార్చి 31న వివాహం జరిగింది. హడావుడి తగ్గిన తర్వాత ఈ నెల 2న పెళ్లికి వచ్చిన కానుకలను హేమేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాడు. గిఫ్ట్ రేపర్ లు తొలగించి ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. గిఫ్ట్ గా వచ్చిన ఓ హోం థియేటర్ ను బయటకు తీసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వగానే అది పేలిపోయింది. పేలుడు ధాటికి గది మొత్తం ధ్వంసమైంది. హేమేంద్ర అక్కడికక్కడే చనిపోగా.. ఆయన సోదరుడు రాజ్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాజ్ కుమార్ మార్గమధ్యంలోనే చనిపోయాడు. 

హేమేంద్ర కుటుంబ సభ్యుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు ఘటనా స్థలంలో గన్ పౌడర్ ఆనవాళ్లు కనిపించాయి. హోంథియేటర్ లో బాంబును అమర్చి ఉంటారని అనుమానించిన పోలీసులు.. ఆ గిఫ్ట్ ఎవరిచ్చారనేది ఆరా తీశారు. గిఫ్ట్ ఇచ్చిన సర్జు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. సర్జు.. పెళ్లికూతురు మాజీ బాయ్ ఫ్రెండ్ అని, తనను కాదని హేమేంద్రను పెళ్లి చేసుకుందనే కక్షతో హోంథియేటర్ లో బాంబు పెట్టి గిఫ్ట్ ఇచ్చాడని తేలింది. దీంతో పోలీసులు సర్జును అరెస్టు చేసి, జైలుకు పంపించారు.

wedding gift blast
Chhattisgarh
Ex boyfriend

More Telugu News