పెళ్లి కొడుక్కి మాయమాటలు చెప్పి వివాహం ఆపివేయించిన వలంటీరు.. చెప్పులు, చీపుర్లతో చితక్కొట్టిన యువతి తల్లిదండ్రులు!

Gannavaram volunteer attacked by bride relatives
  • గన్నవరం సచివాలయం-3లో పనిచేస్తున్న నిందితుడు
  • అదే సచివాలయంలో పనిచేస్తున్న యువతికి పెళ్లి నిశ్చయం
  • పెళ్లికి ముందు రోజు రాత్రి పెళ్లి కొడుకును కలిసి అమ్మాయిని తాను ప్రేమిస్తున్నట్టు చెప్పిన నిందితుడు
  • యువకుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన వైనం
ఆ అమ్మాయికి ఈ నెల 22న పెళ్లి జరగాల్సి ఉంది. వధువు ఇంట సందడి నెలకొంది. బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడింది. తెల్లారి పెళ్లి కోసం సిద్ధమవుతుండగా పిడుగులాంటి వార్త తెలిసింది. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు వరుడి కుటుంబం నుంచి కబురందింది. అంతే.. వధువు సహా కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసి భగ్గుమన్నారు. పెళ్లి ఆగిపోవడానికి కారణమైన యువకుడిని పట్టుకుని చెప్పులు, చీపుర్లతో దేహశుద్ధి చేశారు. గన్నవరంలో జరిగిందీ ఘటన. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం సచివాలయం-3లో ఈడ్పుగంటి రాంబాబు గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్న యువతికి ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం చొప్పరమెట్లకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. 22న పెళ్లి జరగాల్సి ఉండగా ఇరుకుటుంబాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పెళ్లికి ముందు రోజు రాత్రి పెళ్లికొడుకును వెతుక్కుంటూ వెళ్లిన రాంబాబు.. పెళ్లి కూతురు, తాను ప్రేమించుకున్నామంటూ మాయమాటలు చెప్పాడు. దీంతో వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. 

ఎందుకు రద్దు చేసుకుంటున్నదీ చెప్పాలని నిలదీయడంతో రాంబాబు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు నిన్న పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రాంబాబును పట్టుకుని చీపుర్లు, చెప్పులతో చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Gannvaram
Village Volunteer
Andhra Pradesh

More Telugu News