లంచగొండి అధికారులపై దయ చూపక్కర్లేదు: సుప్రీంకోర్టు
- నేర నిరూపణకు ప్రత్యక్ష సాక్ష్యం తప్పనిసరి కాదని వెల్లడి
- పరోక్ష సాక్ష్యంతోనైనా లంచగొండులను శిక్షించవచ్చని తీర్పు
- అవినీతి కేన్సర్ లాంటిదన్న అత్యున్నత న్యాయస్థానం
అవినీతి జరిగినట్టు ప్రత్యక్ష రుజువులు లేకపోయినా, ఇతరత్రా బలమైన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని సదరు అధికారులను దోషులుగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారుడు ఎదురుతిరగడం లేదా చనిపోయినప్పుడు.. ఇతరత్రా ఉన్న సాక్షులు లేదా డాక్యుమెంట్లు, సందర్భోచిత సాక్ష్యాల ఆధారంగా సదరు ఉద్యోగి లంచం అడిగినట్లు, తీసుకున్నట్లు నిరూపించవచ్చని తెలిపింది.
అవినీతి కేన్సర్ లాంటిదని, ఇది ప్రభుత్వంతోపాటూ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. అవినీతి ముప్పుపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.